హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీసీ ఉద్యమానికి సాహిత్య రంగం బలమైన భావజాల, సాంసృతిక పునాది వేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, ‘వెంటాడే కలాలు’ సంపాదకుడు జూలూరు గౌరీశంకర్ పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘వెంటాడే కలాలు’ పుస్తక రజతోత్సవ సభలో ఆయన కీలకోపన్యాసం చేస్తూ.. బీసీల చేతుల్లోనే సమాజ నిర్మాణం జరిగినా, వారి చరిత్రను ఇతరులు రాశారని, ఇకపై బీసీలు తమ చరిత్రను తామే రాసుకోవాలని సూచించారు. బీసీ సాహిత్యం ప్రశ్నించే దశకు, అకడి నుంచి ప్రత్యామ్నాయ సామాజిక దృక్పథాన్ని ప్రతిపాదించే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. రాజ్యాధికారమే పరమావధిగా ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చేలా ప్రజలను చైతన్యపరచడమే బీసీ రచయితలు, మేధావుల కర్తవ్యమని జూలూరు స్పష్టంచేశారు.
ఇంతమంది బీసీ కవులు ఒకే వేదికపైకి రావడం ఆత్మగౌరవ ప్రకటన అని, పీడిత వర్గాలకు విముక్తి సందేశం ఇవ్వాల్సిన బాధ్యత రచయితలపై ఉన్నదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు సూచించారు. బీసీ రచయితల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం మాట్లాడుతూ.. రాజ్యాధికార సాధన దిశగా భావజాల బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ‘వెంటాడే కలాలు’ తెలుగు సాహిత్యంలో ఒక నిశ్శబ్ద విప్లవం సృష్టించిందని, రాబోయే తరాలకు ఇది దిక్సూచిగా నిలుస్తుందని ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య పేరొన్నారు.
సభలో ప్రముఖ విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ చింతం ప్రవీణ్, ప్రముఖ కవులు, రచయితలు దెంచనాల శ్రీనివాస్, పాశం యా దగిరి, అంబటి వెంకన్న, సీతారాం, బాణాల శ్రీనివాసరావు, ప్రొఫెసర్ రఘు, జీ విజయలక్ష్మి, జుగాస్ విలి, అన్నవరం దేవేందర్, ప్రొఫెసర్ వీ త్రివేణి, ప్రొఫెసర్ పెబ్బేటి, మల్లికార్జున్, మందవరపు హైమావతి, నాలేశ్వరం శంకరం, ననుమాస స్వామి, ప్రసాదమూర్తి, తగుళ్ల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.