RC 17 | తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఒకప్పుడు గ్రామీణ నేపథ్యం, నగర కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దర్శకులు, ఇప్పుడు తెలంగాణ నేటివిటీ, భాష, సంస్కృతి, జీవనశైలిని ప్రతిబింబించే కథలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తెలంగాణ బ్యాక్డ్రాప్ కథలకు డిమాండ్ మరింత పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘బలగం’, ‘దసరా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, తెలంగాణ సంస్కృతిని సహజంగా ఆవిష్కరించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ‘ఎల్లమ్మ’, ‘ఇడుపు కాగితం’ వంటి చిత్రాలు కూడా తెలంగాణ నేపథ్యాన్నే ప్రధానంగా తీసుకుని తెరకెక్కాయి.
థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలపై కూడా తెలంగాణ రూటెడ్ కథలకు మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. సినీ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల ప్రాజెక్టుల వరకు తెలంగాణ సంస్కృతి, స్థానిక భాష, సంప్రదాయాలు, గ్రామీణ జీవనశైలిని ప్రతిబింబించే కథలపై చర్చలు జరుగుతున్నాయట. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలకు బాగా కనెక్ట్ అవుతుండటంతో దర్శకులు, నిర్మాతలు నేటివిటీకి మరింత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు ప్రాంతీయ యాసతో సినిమాలు తీయడానికి వెనుకంజ వేసిన మేకర్స్, ఇప్పుడు అదే అంశాన్ని సినిమాకు బలంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న తదుపరి సినిమాపై కూడా ఓ ఆసక్తికర ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలో సాగే పక్కా రూటెడ్ స్టోరీగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఉత్తరాంధ్ర నేపథ్యంతో తెరకెక్కి మంచి ఆదరణ పొందిన నేపథ్యంలో, ఇప్పుడు ఆయన తెలంగాణ నేటివిటీతో కూడిన కథలో కనిపిస్తారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే రామ్ చరణ్–సుకుమార్ ప్రాజెక్ట్ తెలంగాణ బ్యాక్డ్రాప్లోనే ఉంటుందనే విషయంపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే కావడంతో, దీనిపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.