హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ వరర్స్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఇందిరాపారు వద్ద ‘మున్సిపల్ కార్మికుల మహాధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. సుమారు నలబై ఏండ్ల క్రితమే కొత్తగూడెంలో మున్సిపల్ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మున్సిపల్లో పర్మినెంట్ కార్మికులతోతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు సమానంగా పని చేస్తున్నారని, కానీ వారి జీతాల్లో మాత్రం వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు.
కార్మికులు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తానని, సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ..కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిషరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పనులు ఆపేసి సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఎస్ బాల్రాజ్, కే రవిచంద్రన్, కే ఏసురత్నం, వనంపల్లి జైపాల్ రెడ్డి, కాంతారావు, హరినాథ్రావు, ఎం నరసింహ తదితరులు పాల్గొన్నారు.