Harish Rao | రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్‌రావు మండిపడ్డారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4.17 కోట్లు మాత్రమేనని మరోసారి స్పష్టం చేశారు. తాము కూడా గత ప్రభుత్వాలు వారసత్వంగా ఇచ్చిన అప్పులను కడుతూనే.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అంతేతప్ప సీఎం రేవంత్ రెడ్డిలా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ఎల్పీలో శనివారం హరీశ్‌రావు మాట్లాడుతూ.. నీకు చేతగాక.. బీఆర్ఎస్ మీద అబద్ధాలు చెబితే విడిచిపెట్టమని హెచ్చరించారు.
దబాయింపులతో జులుం చేసే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. క్లారిఫికేషన్ ఇచ్చేందుకు మైక్ అడిగినా.. ఇవ్వకుండా సభను వాయిదా వేసుకుని వెళ్లిపోయారని విమర్శించారు. అప్పుల గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని.. దానిపై క్లారిఫికేషన్‌కు మైక్ ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. అప్పుల గురించి ఒక జోక్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి ఈ మంత్రులు ఎప్పుడెప్పుడు ఏమేమీ మాట్లాడారో పాత వీడియోలు తీసి.. ఒక్క దగ్గర వేసి చూపిస్తే వాళ్లకు సిగ్గొస్తుందని అన్నారు.
పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4.17లక్షల కోట్లే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వారసత్వంగా 72 వేల కోట్ల అప్పు వచ్చిందని తాను అసెంబ్లీలో చెప్పానని తెలిపారు. అది 72వేల కోట్లు మాత్రమే కాదని అన్నారు. మీరు అధికారం తీసుకున్నప్పటికీ.. పాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు అది ఆయన స్పష్టం చేశారు. పైగా 11 వేల కోట్లు కార్పొరేషన్లకు అప్పు ఉందని అన్నారు. అంటే 83వేల అప్పు ఉందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 వరకు చేసిన 15 వేల కోట్లు ఉందని అన్నారు. ఇదే లక్ష కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇవేవీ అప్పుల చిట్టాలో కలపలేదని అన్నారు.
పదేండ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చేసరికి కూడా రూ.72వేల కోట్ల అప్పు ఉందని హరీశ్‌రావు తెలిపారు. ఈ పదేండ్లలో పాత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పులకు మిత్తీల రూపంలో 3లక్షల కోట్లు కట్టామని పేర్కొన్నారు. మూడు లక్షల కోట్ల అప్పు కట్టుకుంటూనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. రైతుబంధు ఇచ్చాం.. రైతు బీమా ఇచ్చాం.. 2వేల పింఛన్ ఇచ్చాం.. కల్యాణలక్ష్మీ ఇచ్చాం.. కేసీఆర్ కిట్ ఇచ్చాం.. ప్రాజెక్టులు కట్టాం.. మంచినీళ్లు ఇచ్చాం.. సబ్స్టేషన్లు కట్టాం.. 24 గంటల కరెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. నీలెక్క అప్పులు అప్పులు అని చెప్పి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.
నీకు చేతగాక.. ప్రజల ముందుకు వెళ్లలేక బీఆర్ఎస్ మీద అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే విడిచిపెట్టమని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు. త్వరలోనే ఎడిటర్లు, ఇంటెలెక్చువల్స్ అందర్నీ పిలిచి ఈ అప్పులపై మరో ప్రజెంటేషన్ ఇస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలను బయటపెట్టి.. ప్రజా క్షేత్రంలో నిలబెడతామని అన్నారు.