Kaleru Venkatesh | అంబర్పేట, మే 28: హైదరాబాద్లోని నల్లకుంట డివిజన్ నర్సింహ బస్తీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. డివిజన్ కార్పొరేటర్ వై.అమృతతో కలిసి నర్సింహ బస్తీలో రూ.5లక్షలతో మంచి నీటి పైప్లైన్ ఏర్పాటు, రూ.35లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ బస్తీలోని అన్ని గల్లీల్లో తిరుగుతూ అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సింహబస్తీలో ఉన్న సమస్యలను అన్నింటిని తాను తెలుసుకున్నానని చెప్పారు. మొదటి నుంచి బస్తీ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ బస్తీలో ఇప్పటికే డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ పనులు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు సీసీ రోడ్డు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి బస్తీలో కూడా అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు.