ఖైరతాబాద్, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందన్న నమ్మకం లేదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘42 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో అమలు సాధ్యమా’ అనే అంశంపై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. అగ్రవర్ణాల నాయకత్వం ఉన్న పార్టీలతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడుతామని ఎనిమిది నెలల కాలయాపన చేశారని గుర్తుచేశారు.
ఆ తర్వాత మొక్కుబడిగా ప్లానింగ్శాఖకు అప్పగించి తప్పుల తడకగా లెక్కలు వేశారని, చివరకు కులగణన రిపోర్టు కూడా బయటపెట్టలేదని, ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే ఎలా నమ్మాలని అనుమానం వ్యక్తంచేశారు. ఆర్టికల్ 31(సీ)ద్వారా 9వ షెడ్యూల్లో చేర్చకుండా రిజర్వేషన్లు అమలుకావని స్పష్టంచేశారు. ఓ వైపు బీజేపీ రిజర్వేషన్లపై ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. 2005లోనే అప్పటి మన్మోహన్సింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకురావాలన్న ప్రయత్నం చేశారని గుర్తుచేశారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలరాజుగౌడ్, తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్నగౌడ్, పిడికిలి రాజు, దుర్గయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.