హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): జైపూర్ కేంద్రంగా పాలించిన రాజా సవాయి జైసింగ్‌కు ఉజ్బెకిస్థాన్‌లో అవమానం జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అక్కడి ఉలుం బేగ్ యూనివర్సిటీలోని సమర్కండ్ అబ్జర్వేటరీ మ్యూజియంలో ఏర్పాటుచేసిన ఓ బోర్డులో జైసింగ్‌ను ‘ప్యాలెస్‌లో పనివాడు’గా అభివర్ణించారని పేర్కొన్నారు. దీనిని మార్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ఆమె విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ‘బాబర్ చక్రవర్తి ఆదేశాల మేరకు 1719-48 మధ్య భారతదేశంలోని జైపూర్, బనారస్, ఢిల్లీలో అబ్జర్వేటరీలను నిర్మించారు. వీటిని ప్యాలెస్‌లోని సేవకుడు, అస్ట్రానమర్ అయిన సవాయి జైసింగ్ ఏర్పాటు చేశార అని సమర్కండ్ అబ్జర్వేటరీ బోర్డులో పేర్కొన్నారని కవిత చెప్పారు. ఒక గొప్ప రాజును పనివాడితో పోల్చడం భారతదేశ చరిత్రకు అవమానమని అన్నారు. విదేశాంగ మంత్రి ఉజ్బెకిస్థాన్ అధికారులతో మాట్లాడి పొరపాటును సరిచేయాల్సిందిగా కోరారు. దేశ సుసంపన్న చరిత్రకు చిహ్నాలైన రాజులకు సముచిత గౌరవం దక్కేలా చూడాలని కోరారు.
నాకు ఎలాంటి నోటీసులు రాలేదు: కవిత
తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచీ నోటీసులు రాలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చుని కొందరు దురుద్దేశ పూర్వకంగానే మీడియాను తప్పుదోవ పటిస్టున్నారని విమర్శించారు. ‘ఢిల్లీలో కూర్చుని కొందరు దురుద్దేశపూర్వకంగానే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీడియా సంస్థలు తమ సమయాన్ని నిజాన్ని చూపేందుకు ఉపయోగించాలి. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని వృథా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. నేను మరో విషయం స్పష్టం చేయదల్చుకున్నా.. నాకు ఎలాంటి నోటీసులు రాలేదు’ అని శుక్రవారం ట్వీట్ చేశారు.