హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభా వేదికగా సాగుతున్న వాదోపవాదాలు, సభ్యుల ప్రవర్తనపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ఏది పడితే అది మాట్లాడి, ఇతరులను దూషిస్తే బయట హీరోలుగా చెలామణి అవ్వొచ్చని కొందరు భ్రమపడుతున్నారని పేర్కొన్నారు. గతంలో అసెంబ్లీ అంటే గౌరవప్రదమైన చర్చలు జరిగేవని, కానీ ఇప్పుడు తిట్టుకోవడానికే సభ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఆమె అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. తనపై మంత్రి సీతక చేసిన వ్యాఖ్యల పట్ల విస్మయం వ్యక్తంచేశారు.
మంత్రి సీతక్క తనను ఉద్దేశించి చేసిన విమర్శలపై సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ‘నేను సీతక్కను ఏమీ అనలేదు. కానీ ఆమె నన్ను ఉద్దేశించి ఎందుకు కామెంట్ చేసిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఒకవేళ ఏమైనా అని ఉంటే ఆమెకే తెలియాలి’ అని పేర్కొన్నారు. సభలో తాను ఎలాంటి అభ్యంతరకర వ్యా ఖ్యలూ చేయలేదని, అనవసరంగా తనను వివాదంలోకి లాగారని అన్నారు. గతానికీ ఇప్పటికీ ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉన్నదని చె ప్పారు. ఒకప్పుడు శాసనసభ అంటే ప్రజా స మస్యలపై అందరం కలిసి చర్చించుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు తిట్టుకోవడానికే సభను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా.. ప్రతిపక్షాలు వారి లోపాలను ఎత్తిచూపడం సహజమని, కానీ ఇప్పు డు సభ జరుగుతున్న తీరుపైనే చర్చించాల్సిన దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.