KCR : హైదరాబాద్ ప్రగతిని గమనించి ‘పవర్ ఐలాండ్’గా తీర్చిదిద్దానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఎన్నో సమీక్షలు చేసి, అద్భుతమైన టెక్నోక్రాట్లను పెట్టి, విద్యుత్ వ్యవస్థను బ్రహ్మాండంగా నడిపించామని చెప్పారు. అందుకే మంచి ఫలితాలు వచ్చాయని, అద్భుతంగా విద్యుత్ సరఫరా జరిగిందని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్‌లో చిన్న వర్షం పడితే గంటల కొద్దీ కరెంటు పోయే దుస్థితి వచ్చిందని విమర్శించారు. మేం అద్భుతంగా నడిపిన కరెంటు వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతున్నదని ప్రశ్నించారు.
‘అప్పుడు మేం అన్ని సమీక్షల తర్వాత అద్భుతమైన టెక్నోక్రాట్లను పెట్టి విద్యుత్ వ్యవస్థను బ్రహ్మాండంగా నడిపినం. అందుకే మంచి ఫలితాలు వచ్చినయ్. అద్భుతమైన కరెంటు సరఫరా జరిగింది. ఇప్పుడు హైదరాబాద్‌లో చిన్న వర్షం పడితే ఐదు గంటలు, ఆరు గంటలు, 10 గంటలు కూడా కరెంటు పోయిన ఏరియాలు కూడా ఉన్నయ్. చందానగర్‌లో 24 గంటలు కరెంటు పోతే వాళ్లు సబ్‌స్టేషన్ మీద దాడిచేసే పరిస్థితి వచ్చింది’ అని కేసీఆర్ చెప్పారు.
‘దురుదృష్టం ఏందంటే హైదరాబాద్ ప్రగతి, బ్రాండ్ ఇమేజ్, పెట్టుబడులు తరలివస్తున్న తీరు తెన్నులను గమనించి నగరాన్ని పవర్ ఐలాండ్‌గా చేసిన. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం నేషనల్ గ్రిడ్‌లో లేకుండే. సదరన్ గ్రిడ్‌లో ఉండె. నేను చాలా కష్టపడి వార్దా-డిచ్పల్లిగానీ, వరంగల్-వరోరా లైన్నుగానీ స్పీడప్ చేయడం, అంగుల్-పలాస లైన్ కలిపించడం చేసిన. అన్ని జనరేటింగ్ స్టేషన్లకు హైదరాబాద్‌ను లింక్ చేసిన. ఏదన్నా ఒక లైన్ ఫెయిలైనా ఇంకో లైన్ నుంచి హైదరాబాద్‌కు కరెంటు వచ్చే ఏర్పాటు చేసిన. అంటే న్యూయార్క్‌లో పవర్పోతది, లండన్‌లో పవర్ పోతదిగానీ హైదరాబాద్‌లో కరెంటు పోదు అనే స్థాయికి హైదరాబాద్‌ను చేర్చినం’ అని కేసీఆర్ అన్నారు.
‘దురదృష్టం ఏందంటే ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ప్రజలు మళ్లీ జనరేటర్ల మీద ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. మళ్లీ ఇన్వర్ట్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు వచ్చినయ్. ఇది చాలా బాధాకర విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తదని నేను అనుకోలే. హైదరాబాద్ సిటీ ఇమేజ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. దీన్నే దెబ్బతీసే స్థాయికి ప్రభుత్వం పోయింది. గ్రామాల్లో కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినయ్. ఎన్నో మోటార్లు కాలిపోయినయ్. మూలకుపడ్డ మోటార్ వైండింగ్ మిషన్లన్నీ మళ్లీ పునరుత్తేజం పొందినయ్. ఏదో ఒక జిల్లాలో కాదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. వీళ్ల అసమర్థత, అతి ప్రవర్తనతో ఉన్న ఆధికారులను ఏకపక్షంగా తీసేశారు. మొత్తం ఐఏఎస్‌ల నిలయం చేశారు. చాలా భయంకర పరిస్థితులు తీసుకొచ్చారు’ అని మండిపడ్డారు.