చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 31: ఇతని పేరు అంతటి ఈశ్వరయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం. ఈశ్వరయ్యకు ఐదెకరాల భూమి ఉన్నది. ఏటా రూ.50 వేల రైతుబంధు సాయం వస్తున్నది. ఆ డబ్బుతో బర్రెలు కొన్నాడు. ఏడాదికి ఒకటి చొప్పున ఇప్పటి వరకు మూడు బర్రెలు కొన్నాడు. ఇప్పుడవి రోజూ 10 నుంచి 15 లీటర్ల పాలిస్తున్నయి. దాంతో నెలకు రూ.20 వేల ఆదాయం వస్తున్నది. పండిన పంట మొత్తం మిగులుతున్నదని ఈశ్వరయ్య తెలిపాడు. గతంలో పంట చేతికి రాగానే మొత్తం ఖర్చులకే సరిపోయేదని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నాడు. ఈ సారి కూడా బర్రెను కొంటానని సంతోషంతో చెప్పాడు.