హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్/కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): ఆదివారం తెల్లవారగానే గాజులరామారంలోని బస్తీల్లో ప్రజలంతా పెత్రమాస పండుగ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి, ఎంగిలిపూల బతుకమ్మ ఆడుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ హఠాత్తుగా హైడ్రా బుల్డోజర్లతో విరుచుకుపడింది. ప్రజలను బయటకు తరిమేసి, ఇండ్లను నేలమట్టం చేసింది. పోలీసు భారీ బందోబస్తు నడుమ, బస్తీవాసుల వేడుకోళ్లు, నిరసనలు, హాహాకారాల మధ్య హైడ్రా కనికరం లేకుండా వ్యవహరించింది. పెద్దఎత్తున ప్రభుత్వభూమిని ఆక్రమణల నుంచి కాపాడామంటూ అధికారులు గొప్పలు చెప్పుకొచ్చారు.
కానీ అదే ప్రాంతంలో భూఆక్రమణలకు పాల్పడిన అధికారపార్టీ నేతల విషయంలో హైడ్రా అధికారులు స్వామిభక్తి చాటుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. పన్నెండు ఎకరాల ప్రభుత్వభూమిని ఆక్రమించారంటూ ఆరోపణలున్న ఎమ్మెల్యే కుటుంబసభ్యుల భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి.. పెద్ద పని చేసినట్టు ప్రకటించున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పేదల విషయంలో కఠినంగా వ్యవహరించి, అధికారపార్టీ నేతల ఆక్రమణల విషయంలో హైడ్రా తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందని నిప్పులు చెరుగుతున్నారు.
గాజులరామారంలోని పలుబస్తీల్లో హైడ్రా అధికారులు 275 ఇండ్లను పూర్తిగా కూల్చివేశారు. ప్రభుత్వపెద్దల ఆదేశాలను పాటిస్తూ అధికారపార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబ సభ్యులు.. అదే సర్వే నంబర్ 307లోని ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను తూతూమంత్రంగా కూల్చివేశారు. ఇది ప్రభుత్వ భూమి అంటూ అక్కడ బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా వివక్షపూరిత వైఖరిపై.. ఇండ్లు కోల్పోయిన పేదలు మండిపడుతున్నారు.
ప్రభుత్వ భూమి అయిన 307 సర్వే నంబర్లోని 12 ఎకరాలను ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరిట రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నెల 22న కేసుకు విచారణ ఉన్నందున రెవెన్యూ, హైడ్రా అధికారులు పేదల ఇండ్ల కూల్చివేసి, ఎమ్మెల్యే స్థలం ఫెన్సింగ్ తొలగించినట్టు స్థానికంగా చర్చ జరుగుతున్నది.