హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూదాహంతో నిరుపేద రైతుల బతుకులను చిందర వందర చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా హైదరాబాద్ నగరంలో ఏండ్లుగా చిరువ్యాపారం చేసుకొనే బడుగు జీవులపై తన ప్రతాపం చూపింది. పేదలపై పగబట్టినట్టుగా వారి భూములను కొల్లగొట్టి పెద్దలకు భూసంతర్పణ చేస్తున్న ప్రభుత్వ పెద్దల కన్ను ఇప్పుడు చిరు వ్యాపారులపై పడింది. నగర శివారు ప్రాంతాల్లోని అసైన్డ్ భూములే లక్ష్యంగా నిరుపేద రైతుల నుంచి సర్కార్ ఇష్టారీతిన కొల్లగొడుతున్నది. మైనింగ్ పేరిట అడ్డగోలుగా భూములను కాంట్రాక్టు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నది. సర్కార్ అపసవ్య విధానాలతో ఒకవైపు హైడ్రా, మరోవైపు జీహెచ్ఎంసీ.. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలకు నిద్రలేకుండా హడలు పుట్టిస్తున్నాయి. తాజాగా పొట్ట చేతపట్టుకొని బతుకు జీవుడా అంటూ ఆరుగాలం కష్టపడే బడుగుజీవులపైనా సర్కార్ పంజా విసురుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం ఉదయం రహదారుల విస్తరణ, ఫుట్‌పాత్‌ల క్లీనింగ్ ముసుగులో రోడ్లపై అమ్మకాలతో జీవనోపాధి పొందే చిరు వ్యాపారులపై బుల్డోజర్లను దింపి వారి జీవితాలను రోడ్డు పాల్జేసింది. ముందస్తు నోటీసులు, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా చర్యలు తీసుకున్న అధికారులపై బాధిత వ్యాపారులంతా తిరుగబడ్డారు. బుల్డోజర్లకు అడ్డంగా పడుకొని ఆందోళనకు దిగారు. మోండా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లలో కలిపి 798 చోట్ల అధికారులు జరిపిన కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. చిరు వ్యాపారులపై బుల్డోజర్లను దింపిన సర్కార్ తీరుపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడ్డారు.
ఉరుము లేని పిడుగులా బడుగుజీవుల బతుకులను సర్కార్ మరోమారు రోడ్డుపాలు చేసింది. అక్రమార్కులను వదిలి పొట్టచేత పట్టుకొని ఆరుగాలం శ్రమించే కష్టజీవులపై దౌర్జన్యానికి దిగింది. రహదారుల విస్తరణ, ఫుట్‌పాత్‌ల క్లీనింగ్ ముసుగులో రోడ్లపై చిరువ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకొనే వేలాది మంది అసహాయులపై దాడి చేసింది. శనివారం తెల్లారేలోగా బుల్డోజర్లు, జేసీబీలతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి తమ ప్రతాపం చూపారు. ఆరు జోన్ల పరిధిలోని 798 (పర్మినెంట్ 340, తాత్కాలికమైనవి 458) చిరు వ్యాపారాలను చెల్లాచెదురు చేసి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టారు. మోండా మార్కెట్, ఆరాంఘర్, మదీనా ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ పోలీసులు, అధికారులు తమ బలగాలతో కూల్చివేతలు చేపట్టారు. ముందస్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా, నిరాశ్రయులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా ఒక్కసారిగా యంత్రాలతో విరుచుపడటంతో ఏండ్ల తరబడి చిరు వ్యాపారాలు చేసుకుంటున్న కుటుంబాలు రోడ్డునపడ్డాయి. పాతబస్తీలోని లాడ్‌బజార్, రికాబ్‌గంజ్ రోడ్‌తోపాటు ఖైరతాబాద్, రాజేంద్రనగర్ పరిధిలోని శ్రీనగర్‌కాలనీ, ఆరాంఘర్ వరకు ప్రధాన రహదారులపై ఉన్న తోపుడు బండ్లు, చిన్నపాటి డబ్బాలను స్వాధీనం చేసుకొన్నారు. గడువు ఇవ్వాలని బాధితులు వేడుకున్నా అధికారులు వినిపించుకోలేదు. బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని బాధితులు నిరసన తెలిపినా కనికరించలేదు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిపిన కూల్చివేతలను బాధిత వ్యాపారులంతా ముక్తకంఠంతో నిరసన తెలిపారు. జేసీబీల ఎదుట నిలబడి ఆందోళనకు దిగారు. నిరసనలతో ట్రాఫిక్ పోలీసులు సైతం వెనక్కి తగ్గారు. అక్కడితో ఆగకుండా వ్యాపారులు మోండా పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
దుకాణాల్లోని సామగ్రిని తీసుకొనేందుకు చిరు వ్యాపారులు అరగంట సమయం ఇవ్వాలని వేడుకొన్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఓ హైకోర్టు అడ్వకేట్ బాధితుల పక్షాన అధికారులను వేడుకున్నా వినిపించుకోలేదు. అధికారుల ఆదేశాలతో దుకాణాలను బుల్డోజర్ డ్రైవర్లు క్షణాల్లో నేలమట్టం చేశారు.
తమాషా చేస్తున్నారా?: ఎమ్మెల్సీ మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు చేపట్టిన కూల్చివేతలను ఎంఐఎం ఎమ్మెల్సీ రెహ్మత్ బేగ్, పత్తర్ ఘట్టి కార్పొరేటర్ సోహెల్ ఖాద్రీ అడ్డుకొన్నారు. జేసీబీ డ్రైవర్‌తోపాటు జీహెచ్ఎంసీ అధికారులపై ఎమ్మెల్సీ బేగ్ తమషా చేస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు మదీనా, ముర్గీచౌక్ ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకొన్నది. కూల్చివేతలకు ఉపయోగించే బుల్డోజర్, జేసీబీ వాహనాలపైకి చేరుకున్న నేతలు అధికారుల చర్యలను నిలదీస్తూ ఇప్పటివరకు జారీచేసిన నోటీసులు ఎక్కడంటూ ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కి తగ్గి కూల్చివేతలను తాత్కలికంగా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించారు. పాదాచారుల సౌకర్యం ముఖ్యమైన అంశమే అయినప్పటికీ చిరువ్యాపారుల కోసం ప్రభుత్వం కేటాయించాల్సిన ‘వెండింగ్ జోన్ల’ ఏర్పాటును విస్మరించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

‘ఇలాంటి సర్కార్‌ను మేమెప్పుడూ చూడలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోతే దరిద్రం పొతది’ అని రోదిస్తూ మోండా మార్కెట్ చిరు వ్యాపారులు శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ తమ జీవితాలను రోడ్డున పడేస్తున్నదని రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తంచేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరుగలేదని, కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమ పొట్టలు కొడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దశాబ్దాలుగా ఇక్కడే వ్యాపారం చేసుకొని బతుకుతున్నామని, ఇప్పుడు కొత్తగా పెట్టుకోలేదని ఫుట్‌పాత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించిన అధికారులు జేసీబీలతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇరువై ఎండ్లుగా ఇక్కడే పూలమ్ముకొని బతుకుతున్న మూడేండ్ల క్రితం మా ఆయన చనిపోయిండు. ఆయన వైద్యానికి అప్పులు చేశాం. నాకు ముగ్గురు పిల్లలు. పూల అమ్ముకొంటేనే మా కుటుంబం గుడుస్తుంది. గతంలో ఉన్న దుకాణం తొలగిస్తే.. రోడ్డు పక్కన తొపుడుబండిపై పూలు అమ్ముకుంటున్నా. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ అంటూ వచ్చి మళ్లీ బండిని తొలగించిండ్రు. తెచ్చిన పూలు అన్ని కరాబైనయి. మేము పూలమ్ముకొవడానికి స్థలాన్ని అధికారులే చూపించాలి.
– నాగమణి, పూలబండి వ్యాపారి, కేపీహెచ్‌బీ కాలనీ