హైదరాబాద్: హైరదాబాద్‌లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామునే కూకట్పల్లి, అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా బుల్డోజర్లు.. తాజాగా మాదాపూర్‌లో పనికానిచ్చేస్తున్నాయి. మాదాపూర్‌లోని కావూరిహిల్స్ పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు.
పార్కు స్థలంలో అక్రమంగా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేశారని కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్రమ షెడ్లను అధికారులు కూల్చివేశారు. ఆక్రమణలను తొలగించి కావూరి హిల్స్ పార్కు పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు. కాగా, పార్కు స్థలాన్ని 25 ఏండ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెప్పారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.
కాగా, హైడ్రా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నదంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. పెద్దలకు నోటీసులిస్తున్న హైడ్రా అధికారులు.. పేదలకు సంబంధించిన నిర్మాణాలను వారు నిద్ర లేవక ముందే పని మొదలు పెడుతున్నారు. దీంతో హైడ్రా కూల్చివేతలు సామాన్యుడి బతుకును ఆగం చేస్తున్నాయి. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలోని ప్రభుత్వ స్థలాలు, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కూకట్పల్లి నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న 16 ఆక్రమణలను తొలగించింది. ఈ మూడు చోట్ల కలిపి 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రక్షించినట్టు హైడ్రా ప్రకటించింది. ఈ కూల్చివేతల్లో సామాన్యుడే మరోసారి సమిధగా మారాడు.