ఉప్పల్ డిసెంబర్ 6: హైదరాబాద్‌లోని మల్లాపూర్, నాచారం డివిజన్ల సరిహద్దులోని బాబానగర్‌లో 15 ఇండ్లను హైడ్రా కూల్చివేసింది. స్థానికంగా ప్రభుత్వ సంస్థ ఆగ్రో ఇండస్ట్రీస్ స్థలంలో ఇండ్లు కట్టుకున్నారని ఆరోపిస్తూ శుక్ర, శనివారాల్లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నిబంధనల ప్రకారమే తాము స్థలాలు కొనుక్కున్నామని స్థానికులు తెలిపారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే ఇండ్లు నిర్మించుకున్నామని చెప్పారు.
ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్ల మీదికి బుల్డోజర్లతో వచ్చి కూల్చివేతలకు పాల్పడటం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు బలగాలతో కలిసి శుక్ర, శనివారాల్లో జరిగిన హైడ్రా కూల్చివేతలతో నిర్వాసితులైన ప్రజలు గుట్టకొకరు చెట్టుకొకరుగా చెల్లాచెదురయ్యారు. కూల్చివేతల తర్వాత హైడ్రా అధికారులు అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

మేం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అన్ని అనుమతులు తీసుకుని ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఇండ్లను అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేయడం దారుణం. ప్రభుత్వం నోటీసులు ఇవ్వకుండా, కనికరం చూపకుండా కూల్చివేతలకు పాల్పడటం బాధాకరం. పేద, మధ్యతరగతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పకతప్పదు.
-స్థానికుడు