జూబ్లీహిల్స్, అక్టోబర్ 2: హైడ్రా పేరిట అక్కా చెల్లెండ్లు బతుకమ్మ వేడుకలను జరుపుకోకుండా చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఫిలింనగర్ లోతట్టు ప్రాంతంలోని షేక్‌పేట్ చెరువు వద్ద బుధవారం బతుకమ్మ వేడుకల్లో మూసీ ప్రాజెక్ట్, హైడ్రా బాధితులు ప్లకార్డులతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న నగర ప్రజలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేడు భిక్షమెత్తుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ పాలనలో పేదలకు ప్రతి పథకం ఒక పండుగలా గడిచిందని.. నేడు బతుకమ్మ చీరలు లేకపోవడమే కాదు, బతుకేలేని శ్మశానంగా మారిందని మండిపడ్డారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేసేదని, కాంగ్రెస్ హయాంలో చేనేత కార్మికులకు కూడా అన్యాయం జరిగిందని విమర్శించారు. కేసీఆర్ పేదల మోములో చిరునవ్వు చూడాలని కోరుకునే వారని తెలిపారు. మళ్లీ ఆ చిరునవ్వులు విరబూసేందుకు పేదలకు, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.