హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): పేద, మధ్య తరగతి ప్రజల గుండెల్లో గునపం దించుకున్న ‘హైడ్రా’ ఇప్పుడు జిల్లాలకూ విస్తరించనున్నదా? ఇన్నిరోజులు హైదరాబాద్‌ను బుల్డోజర్లతో హడలెత్తించిన సంస్థ, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై విరుచుకు పడనున్నదా? రాష్ట్రమంతటా హైడ్రా విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి హైడ్రా బృందాలు! తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించే విషయంపై స్పష్టతనిచ్చారు. తెలంగాణలో హైడ్రా పనితీరుపై ఇతర రాష్ర్టాల అధికారులు కూడా ఆరాతీస్తున్నారని , సక్సెస్ రేటు తెలుసుకుంటున్నారని చెప్పారు. జిల్లాల్లోనూ హైడ్రాను విస్తరించాలని తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని తెలిపారు. త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రతిపాదన పెట్టే అవకాశం ఉన్నదని, ఆపని పైనే ఉన్నామని హైడ్రా కమిషనర్ తన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను హైడ్రా అధికారిక సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
గతంలో జిల్లాల్లోనూ కూల్చివేతలు!
నిరుడు జూలైలో హైడ్రా ఏర్పాటైనప్పటినుంచి కూల్చివేతలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నిర్మాణాల కూల్చివేతల పర్వం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా నిరుడు అదే సమయంలో అనేక జిల్లాల్లో కొనసాగాయి. హైడ్రా జిల్లాల్లోకి రావాలన్న విషయంపై అసెంబ్లీలో ప్రతిపాదిస్తారని చెప్పినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్నది. వేరే జిల్లాల్లో కూల్చివేతలను హైడ్రా చేపట్టకున్నా అప్పట్లో కొనసాగిన కూల్చివేతలకు హైడ్రానే స్ఫూర్తి అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు చేపడితే అదే స్ఫూర్తితో పలు శాఖల అధికారులు జిల్లాల్లో కూల్చివేతలు చేపట్టారు. నిరుడు ఆగస్టులో హైడ్రా హైదరాబాద్‌లో కూల్చివేతలు చేపడితే అదేనెల 28న మహబూబ్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో దివ్యాంగులకు చెందిన 75 ఇండ్లను నేలమట్టం చేశారు. సెప్టెంబర్ 5న రామగుండంలో సిరి ఫంక్షన్‌హాల్‌ను కూల్చేయగా అక్టోబర్ 5న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న రెండు ఇండ్లను కూల్చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఐదంతస్తుల భవనాన్ని కూల్చేశారు. ఇలాంటి కూల్చివేతలు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయా?
అనే చర్చ జరుగుతున్నది.
ప్రజల్లో భయం.. భయం..!
జిల్లాలకు హైడ్రాను విస్తరిస్తారనే వార్తలు వస్తున్నప్పటి నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు కంటిమీద కునుకుండటం లేదని తెలుస్తున్నది. హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు వారిని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్నేండ్లుగా ఉంటున్న వారిని కూడా కంటిమీద కునుకు లేకుండా చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చిన హైడ్రా ఇప్పుడు జిల్లాల్లోకి వస్తే పరిస్థితి ఏమిటని పలువురు వాపోతున్నారు. హైడ్రా చెప్తున్నట్టు అన్ని జిల్లాలకు విస్తరించే పరిస్థితే వస్తే చెరువు బఫర్‌లోని పేదలు, మధ్యతరగతి కాలనీలే లక్ష్యంగా కూల్చివేతలు కొనసాగుతాయన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఎమ్మెల్యేలు హైడ్రా తమ జిల్లాల్లోకి రావాలని కోరుతున్నారని హైడ్రానే చెప్తున్నది. కానీ జిల్లాల్లో హైడ్రాను విస్తరిస్తే కూల్చివేతల అలజడితో సగటు జీవి విలవిల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. హైడ్రా అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తన కంట్రోల్లోకి తీసుకుని సమాంతర ప్రభుత్వ వ్యవస్థను నడుపుతున్నదని పలువురు పట్టణాభివృద్ధి వ్యవహారాల నిపుణులు చెప్తున్నారు.
అధికారపార్టీ నేతలు కావాలంటున్నరు
హైడ్రాను తమ ప్రాంతాల్లోకి తెస్తామని పలువురు మంత్రులు గత సంవత్సరమే అనేక వేదికలపై ప్రకటించారు. మరికొందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు కూడా తమ ప్రాంతంలో హైడ్రా తరహా వ్యవస్థ కావాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుడు సెప్టెంబర్‌లో మహబూబాబాద్‌లో సీఎం రేవంత్ మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో హైడ్రావంటి వ్యవస్థలు తెస్తామని చెప్పారు. అయితే హైదరాబాద్‌లో కూల్చివేతలతో హడలెత్తిస్తున్న హైడ్రా జిల్లాలకు విస్తరిస్తే సగటు జీవి పరిస్థితేమిటన్న చర్చ నడుస్తున్నది. హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పాటుతో అధికారపార్టీ పెద్దలకు ప్రయోజనాలు చేకూరడంతోపాటు కొంత లబ్ధి జరిగిందన్న ప్రచారం ఉన్నది. ఈ క్రమంలో జిల్లాల్లోనూ ఈ వ్యవస్థ కావాలని వారు కోరుతున్నట్టుగా కూల్చివేతల బాధితులు చెప్తున్నారు. ముందుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఏర్పాటు చేసి ఆ తర్వాత విస్తరించి హైడ్రాను తెస్తారని గతంలో ప్రభుత్వ పెద్దలు పలుమార్లు ప్రకటనలు చేసినా ప్రస్తుతం అసెంబ్లీలో హైడ్రాపై చర్చించి జిల్లాలకు విస్తరిస్తామన్న ప్రతిపాదన హాట్ టాపిక్‌గా మారింది.