హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ) : కూల్చివేసిన చోట కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా సిబ్బంది ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఎవ రు ప్రశ్నించినా ‘మీరు ఎవరికైనా చెప్పుకోండి మా పని మేం చేస్తం’ అని హైడ్రా అధికారులంటున్నారని బాధితులు వాపోతున్నారు. మరోవైపు మేలో కందిగల్ గుర్రం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కానీ అదే ప్రాంతంలో మళ్లీ ఒక పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ ప్రహరీ కడుతున్నా హైడ్రా అటు వైపు కన్నెత్తి చూడ టం లేదు. సామాన్యుడికో న్యాయం.. బలవంతుడికో న్యాయం.. అన్నట్టుగా హైడ్రా ప్రవర్తిస్తున్నదని కూల్చివేతల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు ఉత్తర్వులనూ పట్టించుకోరా?
బడంగ్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో పార్క్ ఆక్రమణలంటూ గతంలో హైడ్రా కూల్చేసిన చోటే హైకోర్టు ఉత్తర్వులున్నా వాటిని ఉల్లంఘిస్తూ హైడ్రా సిబ్బంది శుక్రవారం ఫెన్సింగ్ వేశారు. హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేశ్ స్వయంగా అక్కడే నిలుచుని ఫెన్సింగ్ వేయించారు. కాగా జూన్ 13న హైకోర్టు స్టేటస్కో విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ తమ పని తాము చేసుకుపోతూనే ఉన్నారు. హైడ్రా అధికారులే దగ్గరుండి ఫెన్సింగ్ పనులు చేయించడంపై బాధితుడు శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కూల్చిన చోట మళ్లీ కడుతున్నా చూడరా?
కాగా కందిగల్ గుర్రంచెరువు వద్ద మూడున్నర ఎకరాలు ప్రభుత్వ స్థలమని రెవెన్యూ అధికారులు తేల్చేశారు. కానీ మాజీ కార్పొరేటర్ ప్లాట్లు చేసి అమ్మారు. నిర్మాణాలను హైడ్రా మే నెలలో కూల్చేసిం ది. మళ్లీ ఇటీవల ప్రహరీ నిర్మాణానికి పూ నుకున్నారు. హైడ్రా కూల్చివేతల తర్వాత రెవెన్యూ అధికారులు అక్కడ ఈ స్థలం తమదేనంటూ బోర్డు పెట్టినా పట్టించుకోని ఆ మాజీ కార్పొరేటర్ పనులు మొదలుపెట్టారు. దీనిపై హైడ్రా అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు.