HYDRA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో!’.. హైదరాబాద్‌లో సాగుతున్న కూల్చివేతల పర్వం దాశరథి పాటను గుర్తుచేస్తున్నది. గీతానుసారంగా పురుడుపోసుకున్నాయని చెప్తున్న ఈ కూల్చివేతలు ఎన్ని హైడ్రామాలు సృష్టించినా చివరకు బీఆర్ఎస్ నేతల నిర్మాణాల మజిలీ చేరే దాకా విశ్రమించేలా కనిపించటం లేదు. కాకపోతే ఈ మధ్యలో పేదోళ్ల గూడుపై బుల్డోజర్ల దాడులు.
రాజు సంతృప్తి చెందేవరకు ఇంకెంత మంది సామాన్యులు బజారున పడాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా జంట జలాశయాల పరిధిలోని ప్రభుత్వ పెద్దల సౌధాల గుట్టురట్టయినా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడకపోవటం.. ఒవైసీ వైద్య కళాశాలకు ‘హితో’ధికంగా గడువు ఇవ్వడం ఒకవంతైతే.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు వరుసగా నోటీసులు జారీ చేస్తుండటంతో పాటు జన్వాడ ఫాంహౌస్ దగ్గర చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలు మరోవంతు. ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలను గమనిస్తే ప్రతి నిర్మాణంలోనూ రాజకీయం దాగున్నదనే వాస్తవం అర్థమవుతున్నది.
హైడ్రా ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో 18 కూల్చివేతలు చేపట్టినట్టు వెల్లడించింది. అందులో తొలిసారి జూన్ 27న లోటస్‌పాండ్ వద్ద కూల్చివేతలు చేపట్టారు. జూలై 1, 4, 5, 14వ తేదీల్లోనూ పలుచోట్ల కూల్చివేతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం గత నెల 19న హైడ్రా ఏర్పాటు, విధి విధానాలు, పరిధిని వివరిస్తూ జీవో 99ను జారీ చేసింది. ఆపై చేపట్టిన పలు కూల్చివేతల్లో భాగంగా ఈ నెల 18న ఔటర్ రింగు రోడ్డు పరిధి దాటి జీవోలో పొందుపరచని ప్రాంతాలకు కూడా హైడ్రా వెళ్లింది.
చిలుకూరు, హిమాయత్‌నగర్, అప్పోజీగూడల్లో నిర్మాణాలను కూల్చివేశారు. అయితే, ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హిమాయత్‌నగర్, అప్పోజీగూడల్లోని కూల్చివేతల వివరాలను పొందుపరచకపోవటం గమనార్హం. ముఖ్యంగా అప్పోజీగూడలో గండిపేట ఎఫ్టీఎల్ల్లో ఉన్నాయంటూ కూల్చివేసిన మూడు నిర్మాణాలు.. వాటి పక్కనే ఉన్న వాటిని వదిలివేయటమే హైడ్రా అడుగులపై తీవ్ర సందేహాలకు తావిచ్చింది. అనుమానానికి తగ్గట్టే హైడ్రా తన నివేదికలో ఈ వివరాలను పేర్కొనలేదు. పైగా పరిధి దాటి చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు.
హైడ్రా చివరగా ఈ నెల 24న ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. అనంతరం ఇతర శాఖలు నోటీసులు ఇవ్వటం మొదలుపెట్టాయి. ఇందులోభాగంగా ఘట్కేసర్ మండలం వెంకటాపురంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థలకు నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇదే క్రమంలో ఒవైసీ బ్రదర్స్‌కు చెందిన వైద్య కళాశాల సలకం చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ కావటంతో మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హై
డ్రాను ఎదుర్కొనేందుకు 40 వేల మంది విద్యార్థులు ఉన్నారని హెచ్చరించారు. ఇదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా జీహెచ్ఎంసీని కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో హైడ్రా స్వరం మారింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థలకు గడువు ఇస్తామని, అది ఒవైసీ అయినా, మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి అయినా ఒకటేనని స్పష్టంచేశారు. తాజాగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లోనూ ఒవైసీకి చెందిన నిర్మాణానికి గడువు ఇస్తామని చెప్పారు. కానీ బుధవారమే బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన ఎంఎల్ఆర్ఐటీ, ఐఏఆర్ఈ విద్యాసంస్థలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న నిర్మాణాలను తొలగించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యాసంస్థల్లోనూ వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒవైసీ వైద్య కళాశాలలో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొన్న హైడ్రా.. ఇక్కడ మాత్రం ఆ అంశాన్ని విస్మరిస్తుందా?
తాజాగా కూల్చివేతల అడుగులు జన్వాడ వైపు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ ఉన్న ఫాంహౌస్ ముందు బుల్కాపూర్ నాలాను సర్వేచేస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు అసలు నాలా ఎంత వెడల్పు ఉన్నదనే వివరాలను చెప్పలేకపోతున్నారు. అది ఎంత విస్తీర్ణంలో ఉన్నా నిబంధనల ప్రకారం అక్కడ ఉన్న ప్రహరీగోడ, గేటు మాత్రమే బఫర్‌జోన్ పరిధిలోకి వస్తాయనే అంచనాకు అధికారులు వచ్చారు. దీంతో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో జీవో 111 కొనసాగుతుందని చెప్పారు. అంటే నాలా నిబంధనలు సర్కారు పెద్దల కలను సాకారం చేసే పరిస్థితి లేకపోవడంతో 111 జీవోను తెరపైకి తెస్తున్నారు. ఇదే అమలైతే జన్వాడ ఫాంహౌస్ మాత్రమే దాని పరిధిలోకి వస్తుందా? 111 జీవో పరిధిలో పుట్టగొడుగుల్లా వెలిసిన విద్యాసంస్థల భవనాలు, ఇతర నిర్మాణాలకూ ఇదే సూత్రం వర్తిస్తుందా? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సామాన్యులు కూడా సర్పంచుల అనుమతులతో వేల నిర్మాణాలు చేపట్టినందున.. 111 జీవో పరిధిలోని గ్రామాల్లో శిథిలాలు తప్ప ఇంకేం కనిపిస్తాయి? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా సీఎం రేవంత్‌రెడ్డి 111 జీవో అమలులో ఉంటుందని సెలవిస్తుండగా.. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం 111 జీవో పరిధిలో ఒక్క నిర్మాణాన్నీ కూల్చనివ్వబోమని స్పష్టం చేశారు. సీఎం ఒకలా, మంత్రి ఇంకోలా మాట్లాడటంపై సామాన్యుల్లో సందేహాలు కలుగుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు నిర్మాణాన్ని కూల్చామని మంత్రులు, సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా.. ఇంకా పల్లం రాజు నిర్మాణం ఇంకా పదిలంగా ఎందుకు ఉన్నది? అనేదానికి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పటం లేదు.