Osman Sagar | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 ( నమస్తే తెలంగాణ ): హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ నిర్ధారణలో అక్రమాలు జరిగినట్టు నీటి పారుదలశాఖ, హైడ్రా అధికారుల తనిఖీల్లో తేలింది. ఆక్రమణదారులకు సహకరిస్తూ అధికారులు ఎఫ్టీఎల్ మ్యాపులో మార్పులు చేసినట్టు అధికారులు గుర్తించారు. నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ విభాగంలోని ముగ్గురు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. ఎస్ఈ వెంకటేశం, ఈఈలు బీమ్ ప్రసాద్, శేఖర్ రెడ్డిలపై పెనాల్టీ చర్యలు ప్రారంభించింది.
ఒకరికి చెందిన ఆస్తి ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదంటూ తప్పుడు క్లెయిమ్ చేసి అక్రమ నిర్మాణాలను సులభతరం చేశారని ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. వాస్తవాలు తప్పుగా చూపుతూ నివేదిక ఇచ్చారనే అభియోగంతో వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు ఉస్మాన్‌సాగర్ పర్యావరణ సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలను తీసుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ ఆదేశించారు.