HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): హైడ్రా అధికారులు తొందరపడి బడుగు, బలహీనవర్గాల ఇండ్లను కూల్చొద్దని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ కోరారు. ఇది ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన హైడ్రా, మూసీ వివాదంపై ట్విట్టర్ వేదికగా వీడియోలను పోస్ట్ చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా అధికారులు.. దళితులు, బలహీన వర్గాల వద్దకు వెళ్లినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. హక్కులున్న ఎవరైనా తమ ఆస్తులు పోగొట్టుకుంటే వాటిని చట్టపరంగా పొందే హక్కు ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా కూల్చివేతలు చేయదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకే ప్రభుత్వం కూల్చివేతలు చేపడుతున్నదని తెలిపారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా కేవలం మార్కింగ్ మాత్రమే చేస్తుంటే.. కూల్చివేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.