హైదరాబాద్ సిటీబ్యూరో/అమీన్పూర్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : పేదల ఇండ్ల కూల్చబోమని చెబుతూనే మళ్లీ హైడ్రా విధ్వంసం సృష్టించడంపై బాధితులు ఆగ్రహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో ఆదివారం కూడా బుల్డోజర్లు దూసుకురావడంతో అధికారులపై బాధితులు దుమ్మెత్తిపోశారు. ఐలాపూర్‌లో సర్వే నంబర్లు 1నుంచి 220 వరకు ప్రభుత్వ భూమి అంటూ శనివారం 860 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకొని అక్కడ ఫెన్సింగ్ వేస్తున్నది. ఈక్రమంలో రెండోరోజు ఆదివారం కూడా హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లపైకి దూసుకెళ్లాయి. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న 208 సర్వే నంబర్లోని ఓ ఇంటిని కూల్చేందుకు వచ్చిన అధికారులతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనానికి అడ్డుపడ్డారు.
భవనం పైకి ఎక్కిన వ్యక్తిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య భవనాన్ని కూల్చేశారు. అన్ని అనుమతులున్నా ఎలా కూల్చేస్తారని బాధితులు అధికారులను ప్రశ్నించారు. కొన్నేండ్లుగా తాము ఈ భూమిలో పంటలను సాగు చేసుకున్నామని, 2011 నుంచి ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నామని బాధితులు చెప్పారు. కానీ వారు సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన మహిళలు హైడ్రా, కాంగ్రెస్ ప్రభుత్వంపై తిట్ల వర్షం కురిపించారు. కోర్టు శనివారం ఇచ్చిన ఉత్తర్వుల్లో మరో సర్వే నంబర్ ఉన్నదని, ఈ సర్వే నంబర్లో నిర్మాణాలు అక్రమంగా కట్టుకున్నారంటూ హైడ్రా సిబ్బంది వారిని అక్కడినుంచి పంపేస్తూ ఎవరైనా అటువైపు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడం కనిపించింది.

ఒకవైపు భవనం కూల్చివేత జరుగుతుండగానే మరోవైపు ఆ శిథిలాలన్నీ పక్కనే ఉన్న మరో భవనంపై ఎగిరిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లంతా భయాందోళన చెందారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా హైడ్రా సిబ్బంది నిర్లక్ష్యంగా చేస్తున్న కూల్చివేతలపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పైకి కూల్చివేస్తున్న ఇంటి గోడ పడటంతో అపార్టుమెంట్‌లోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో హైడ్రా సిబ్బంది పక్క అపార్టుమెంట్‌పై పడిన గోడను తీసేశారు. భవనం కూల్చే సమయంలో ఒకరిద్దరికి స్వల్పగాయాలైనా హైడ్రా అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి చూపిస్తే.. అసలు ఇక్కడికి ఎందుకొచ్చారంటూ కసురుకున్నారని స్థానికులు ఆవేదనతో చెప్పారు.
ఐలాపూర్‌లో ముఖీం ఫాంహౌస్‌ను పూర్తిస్థాయిలో నేలమట్టం చేసి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేగాక 1నుంచి 220 సర్వేనంబర్ గల భూముల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో కూడా అధికారులు ఫెన్సింగ్ వేయించేలా చర్యలు తీసుకున్నారు. రెండో రోజు ఆదివారం ఉదయం నుంచే హైడ్రా అధికారులు, పోలీసులు, హైడ్రా సిబ్బంది ఐలాపూర్‌లో హడావుడిగా కనిపించారు. ఐలాపూర్ సహా చుట్టుపక్కల ఉన్న తండాల్లో హైడ్రా, పోలీసుల వాహనాల సైరన్లతో స్థానికులు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కనిపించారు.
మా తాతల కాలం నుంచి ఈ జాగలో పంటలు సాగుచేస్తున్నం. జాగ పత్రాలు అన్నీ ఉన్నా .. ఇంటిని కూల్చివేయడం ఏమిటి? ఇంటిని కూల్చివేస్తే ఎక్కడికి పోవాలే. -సత్యనారాయణ, మంజుల దంపతులు, ఐలాపూర్
పదేండ్లుగా ఇంటి పన్ను చెల్లిస్తున్నం. కరెంటు బిల్లు కడుతున్నం. రెవెన్యూ అనుమతులు ఉన్నాయి. అయినా అధికారులు మా ఇంటిని కూల్చివేశారు. ఇదెక్కడి న్యాయం? ప్రభుత్వం నిరుపేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నది.
-నగేశ్, బాధితుడు