HYDRAA | మహేశ్వరం, ఆగస్టు 30 : అదెక్కడో మారుమూలన ఉన్న చెరువు కాదు.. సిటీకి దగ్గరలోనే శ్రీశైలం హైవేను ఆనుకొని ఉన్న 60ఎకరాల చెరువు. అదికాస్తా ఇప్పుడు సగానికి పైగా కుచించుకుపోయింది. దానికి వచ్చే వరద మార్గంలోనూ కాంక్రీట్ జంగల్ వెలసింది. అయినా ఇటువైపు నీటిపారుదల శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. 60.32 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండాల్సిన ఈ చెరువు ఎఫ్టీఎల్ను కూడా గుర్తించలేదు.
తమ కళ్లెదుటే అక్కడ దర్జాగా వెంచర్ వెలుస్తున్నా స్పందించిన దాఖలాల్లేవు. ఇంతకీ ఇక్కడ వెంచర్‌ను ముందుగా చేసిందెవరంటే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి!. అందుకే తొలుత ఈ ప్రాజెక్టుకు ‘కేఎల్ఆర్ గిగా’ అని, తర్వాత ‘వర్టెక్స్-కేఎల్ఆర్ గిగా సిటీ’ అని పేరు పెట్టారు. ఏండ్ల కింద కష్టపడి కట్టుకున్న పేదోళ్ల గూడుపైకి బుల్డోజర్లను పంపిస్తున్న హైడ్రా, మరి చెరువును ఆనుకొనే ఉన్న ఈ వెంచర్ వైపు ఎందుకు చూడడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మంఖాల్ రెవెన్యూ గ్రామ పరిధిలో సూరం చెరువు అలియాస్ సూరారావు చెరువు ఉన్నది. సర్వేనంబరు 139లో 40.20 ఎకరాలు, 140లో 20.12 ఎకరాలు మొత్తం 60.32 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉండేది. ఎగువన శంషాబాద్, పహాడీషరీఫ్ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి ఈ చెరువులో చేరుతుంది. చెరువు సమీపంలో నాలుగైదేండ్ల కిందట రియల్ వెంచర్ రూపుదిద్దుకున్నది. కేఎల్ఆర్ గిగా సిటీ పేరుతో మొదలైన ఈ వెంచర్ క్రమంగా చెరువు వైపు విస్తరించింది.
వరద వచ్చే మార్గాన్ని సైతం నియంత్రించేలా నిర్మాణాలు వెలిశాయి. వెంచర్లో మధ్యలోంచి ఉన్న ఈ మార్గంలో తొలుత సిమెంటు పైపులు వేశారు. గ్రామస్తులు నిలదీయడంతో చివరికి డ్రెయిన్ బాక్సులు నిర్మించారు. కానీ ఆ మార్గాన్ని పూర్తిగా చెరువు వరకు నిర్మించలేదు. దీంతో వరద చెరువులోకి వెళ్లడం ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు 60.32 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు ప్రస్తుతం సగమే ఉన్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు. చెరువు భూమిని వెంచర్లోకి మలుపుకొన్నారని ఆరోపిస్తున్నారు.
సూరం చెరువు దుస్థితిపై నీటిపారుదల శాఖ డీఈఈ బీడీ నాయక్‌ను సంప్రదించగా చెరువులన్నింటినీ సర్వే చేసి, ఎఫ్టీఎల్ను కూడా గుర్తించామని చెప్పారు. కానీ, సూరం చెరువు ఐడీని వెల్లడించమంటే ప్రస్తుతం తన దగ్గర అందుబాటులో లేదన్నారు. ఆపై ఆ అధికారి ఫోనెత్తడమే మానేశారు. నీటిపారుదల శాఖ రికార్డులను పరిశీలిస్తే అధికారుల లీలలు బయటపడ్డాయి. 139, 140 సర్వేనంబర్లలో సూరం చెరువు 60.32 ఎకరాల మేర విస్తరించి ఉన్నదని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నట్టు నీటిపారుదల శాఖ నివేదికలో ఉన్నది. కానీ ఎఫ్టీఎల్ ఏమైనా ఆక్రమణకు గురైందా? అనే కాలంలో మాత్రం అదేం లేదని నమోదు చేశారు.
చెరువును ఆనుకొని కళ్లెదుటే నిర్మాణాలు కనిపిస్తున్నా ఆక్రమణలు లేవని పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఈ ప్రాంతం మరింత ఆక్రమణకు గురికాకముందే చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, లేదంటే ఎగువ నుంచి వచ్చే వరద ఇతర ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదముందని స్థానికులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.