హైదరాబాద్ సిటీబ్యూరో/వెంగళరావునగర్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): ‘హైడ్రా ఏర్పాటు కాకముందు ఉన్న నివాసాలకు పర్మిషన్లు ఉన్నా లేకున్నా వాటి జోలికి రాం.. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం ఊరుకోం’.. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన ప్రకటన. కానీ ఇందుకు విరుద్ధంగా స్వయంగా రంగనాథ్ ఇంటికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న వెంగళరావునగర్‌లో అరవైమంది ఇళ్ల యజమానులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలుగైదు దశాబ్దాలుగా ఇక్కడ నివాసముంటున్నవారికి నోటీసులు అందాయి.
వెంగళరావునగర్ ప్రధాన రహదారిలోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం ఎదుట ఉన్న భూమిలోని నివాసాల యజమానులకు హైడ్రాలోని డిప్యూటీ సిటీ ప్లానర్ పేరిట నోటీసులు అందాయి. యూసఫ్‌గూడ గ్రామ సర్వే నంబర్లు 15,16,47,48లోని 44.38 ఎకరాల భూమిలో అక్రమంగా భవనాలు నిర్మించారన్న ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. అయితే ఫిర్యాదుదారు, స్థానిక కార్పొరేటర్ దేదీప్యరావు మాత్రం తాను కేవలం రెండెకరాలకు సంబంధించిన స్థలం ఆక్రమణకు గురవుతున్నదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
కాగా, నోటీసులను ఈనెల 18వ తేదీన సిద్ధం చేయగా, యజమానులకు 19న అందజేశారు. నోటీస్ తేదీ నుంచి మూడు రోజుల్లో నివాసాలకు సంబంధించిన పూర్తి ధ్రువీకరణ పత్రాలను హైడ్రా కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు. ఏండ్లుగా ఇక్కడే ఉంటున్న తమను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని వెంగళరావునగర్ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలు అప్పగించినా, హైడ్రా ఏం చేస్తుందోననే భయంతో మదనపడుతున్నారు. ఈ ఏరియా స్థలం విషయంలో వివరాలు సేకరించాలని హైడ్రా ఏఈ సుజిత్‌ను కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. సుజిత్ మాత్రం నోటీసులు ఇస్తామని, డాక్యుమెంట్స్ చూసిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని స్థానికులకు తెలిపారు.
వెంగళరావునగర్‌లో ఏడువేల నుంచి పదివేల ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జాపై హైడ్రాకు అక్టోబర్‌లో ఫిర్యాదు చేశాం. దీనిపై విచారణ జరిపే సమయంలో కూడా నివాసగృహాల జోలికి వెళ్లొద్దని చెప్పాం. మాకు తెలియకుండా నోటీసులు ఇచ్చారు. ఇళ్లజోలికి వస్తే ఊరుకునేది లేదు.. హౌజింగ్ బోర్డు వాళ్లు ఇక్కడ 41 ఎకరాలకు సంబంధించి తమ పరిధిలోకి వస్తుందని చెప్పారు. మిగతా నాలుగెకరాలకు సంబంధించిన వ్యవహారంపై గొడవ జరగుతున్నది. ఇందులో రెండెకరాల స్థలం పార్క్దిగా హెచ్ఎండీఏ మ్యాప్‌లో ఉంది. దీనిపైనే మేం ఫిర్యాదు చేశాం. కానీ మిగతా రెండెకరాల విషయంలో కమిషనర్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.
-కార్పొరేటర్ దేదీప్యారావు