కరీంనగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్లోని క్రీడా పాఠశాలలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పడక ముందే కరీంనగర్లో భూ ఆక్రమణదారులు, చెరువుల కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చామని, అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ధైర్యాన్ని ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ అయినా, ఏ జిల్లా యంత్రాంగమైనా ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉందని చెప్పారు. కరీంనగర్ పరిసరాల్లోని స్థలాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయని, ఆధారాలుంటే.. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇస్తే త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ స్థలాల మీద ఆంక్షలు విధించదని, కేవలం చెరువుల పరిరక్షణ కోసమే ప్రయత్నిస్తుందని వివరించారు.