Irrigation Department | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా సాగునీటి పారుదల శాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నది. అక్రమార్జనకు కొత్త మార్గాన్ని ఇది తెరలేపింది. చెరువులు, నాలాల సంరక్షణ సంగతేమో గానీ ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుతో వాటి సమీపంలో ఇండ్లు కట్టుకున్న ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. ఎన్వోసీ పేరిట అధికారులు కొత్త దందాలకు తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 1998 నుంచి 2011 వరకు భవన నిర్మాణ అనుమతుల నిబంధనల కోసం ఇచ్చిన 19 జీవోలను మేళవించి 2012 ఏప్రిల్ 7న జీవో నంబర్ 168ని అప్పటి సర్కారు జారీచేసింది. దాని ప్రకారం రిక్రియేషన్, గ్రీన్, బఫర్జోన్ల పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు.
10 మీటర్ల విస్తీర్ణం వరకు ఉన్న కాల్వలు, వాగులు, నాలాలకు చుట్టూ రెండు మీటర్ల వరకు, అంతకంటే ఎకువ విస్తీర్ణంలోని కాల్వలు, వాగులు, నాలాలకు తొమ్మిది మీటర్ల వరకు, పది హెక్టార్ల కంటే తకువ విస్తీర్ణంలో ఉన్న చెరువులు, ట్యాంకులు, కుంటలకు ఎఫ్టీఎల్ నుంచి 9 మీటర్ల వరకు, అంతకంటే ఎకువ విస్తీర్ణంలో ఉంటే ఎఫ్టీఎల్ నుంచి గరిష్ఠంగా 30 మీటర్ల వరకు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే నదులకు సంబంధిత శాఖలు నిర్ధారించిన హద్దుల నుంచి 100 మీటర్ల వరకు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో పారే నదులకు సంబంధిత శాఖలు నిర్ధారించిన హద్దుల నుంచి 50 మీటర్ల వరకు నిర్మాణ అనుమతులపై ఆంక్షలు ఉన్నాయి. ఈ మేరకు ప్లాట్ల యజమానులు, భూ యజమానులు నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు.
ఇటీవల సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా మాత్రం.. ఆ ఎన్వోసీలను తూచ్ అంటున్నది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల నుంచి మళ్లీ ఎన్వోసీలు తీసుకురావాలని షరతులు విధిస్తున్నది. ఇదే అదనుగా ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు కాసులు పిండుకుంటున్నారు. ఎఫ్టీఎల్లో, బఫర్జోన్లో ఇండ్లు లేవని తెలిసి కూడా అధికారులు ఎన్వోసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. లేనిపోని కారణాలు చెప్పి డబ్బులు పిండుకుంటున్నారు. అడిగినంత ఇస్తే ఎన్వోసీ ఇస్తున్నారని, లేదంటే చుక్కలు చూపిస్తున్నారని చెబుతున్నారు. కింది నుంచి పైస్థాయి వరకు చేతులు తడపనిదే పనికావడం లేదని, అన్ని సక్రమంగా ఉన్నాయని చెబితే.. ఏదో ఒక లోపం తెరమీదికి తెచ్చి ఎన్వోసీ తిరస్కరిస్తున్నారని పేర్కొంటున్నారు. అంతేకాదు, సదరు దరఖాస్తుకు రిమార్క్ పెడతున్నారని, ఆన్లైన్లో, లేదా పాత మ్యాపులో సమస్య ఉందని సాకులు చెబుతున్నారని వాపోతున్నారు.