హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉకుపాదం మోపాలని, బ్లాక్ మారెట్ను అరికట్టి సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుకను అందేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం గనుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని, జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతి ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్లు, స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తోపాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇసుక రవాణా వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని, రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని, ఇసుక బుక్ చేసుకున్న 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చూడాలని ఆదేశించారు. ఇసుక వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని, ఫిర్యాదు వచ్చిన వెంటనే పరిషారం జరిగేలా చూడాలని సూచించారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదని, ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే స్వయంగా తానే ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి.. పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా ఇసుక రవాణా జరిగేలా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆదేశించారు.