మొయినాబాద్, డిసెంబర్30: అక్రమ నిర్మాణాలు అన్న కారణంతో తెల్లవారుజామునే అధికారులు పలువురు గిరిజనుల ఇండ్లను నేలమట్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పెద్దమంగళారం రెవెన్యూలో సర్వే నంబర్ 210, 211, 212లో 16 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 50 మంది గిరిజన కుటుంబాలు సంతోష్‌నాయక్ అనే వ్యక్తి ద్వారా ఆరేడేండ్ల క్రితం పాట్లు కొనుగోలు చేసి, ఇండ్లు, గుడిసె లు, రేకుల షెడ్లు కట్టుకున్నారు. హరికిరణ్, హర్ష, సంతోష్‌నాయక్ మధ్యవర్తిత్వం వహించి రాఘవేంద్ర సొసైటీ ద్వారా ప్లాట్లు కొనిపించినట్టు బాధితులు చెప్తున్నారు.
తమ భూమిలో అక్రమంగా కట్టిన ఇండ్లను తొలగించాలని జీ శ్రీనివాస్‌రాజు, సురేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆ నిర్మాణాలను కూల్చివేయాలని 5 నెలల క్రితం కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తూ మొయినాబాద్ మున్సిపల్ శాఖను ఆదేశించింది. హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్, స్థానిక పోలీసులతో మున్సిపల్, టౌన్‌ప్లానింగ్ అధికారులు మంగళవారం తెల్లవారుజామున బుల్డోజర్లతో గిరిజనుల ఇండ్లను కూల్చివేశారు. ఇండ్ల మీదికి బుల్డోజర్లు రావడంతో నిద్రలో ఉన్న గిరిజనులు భయాందోళనకు గురయ్యా రు. ఇంత చలిలో పిల్లలను తీసుకొని తాము ఎక్కడికి వెళ్లాలని, సమయమివ్వాలని అధికారుల కాళ్ల పై పడి ప్రాధేయపడ్డారు. పట్టించుకోని అధికారులు ఇండ్లలో సామాగ్రిని తీయకుండానే కూల్చివేయించారు.