HYDRA | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) పరిధిని ప్రభుత్వం విస్తరించనున్నదా? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. హైడ్రా పరిధిని 111 జీవో పరిధి గ్రామాల వరకు వర్తింపజేయనున్నట్టు తెలుస్తున్నది. దీనికోసం నేడో, రేపో ఆర్డినెన్స్ కూడా జారీ చేసే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్డినెన్స్ జారీ చేసేందుకే అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్టు తెలుస్తున్నది. దీంతో 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు విధిస్తూ 111 జీవోను తీసుకొచ్చారు. జీవో వల్ల ఆ పల్లెలన్నీ బఫర్ జోన్లోకి వెళ్లాయి. అయితే, గత బీఆర్ఎస్ సర్కారు ఆ జీవోను రద్దుచేసి అక్కడి ప్రజలకు స్వాంతన చేకూర్చింది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా పెరిగాయి, క్రయవిక్రయాలు జోరందుకొని నిర్మాణాలు వెలిశాయి. అయితే, ఇప్పుడు ఈ 84 గ్రామాలకు హైడ్రా పరిధిని వర్తింపజేస్తే ప్రస్తుతం ఏర్పాటైన నిర్మాణాల సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది.
చట్టప్రకారమే కూల్చివేతలు: భట్టి
హైదరాబాద్ నగర పరిధిలో చట్టప్రకారమే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఆయన తాజాగా ఎన్ కన్వెన్షన్ కట్టడాల కూల్చివేతపై స్పందించారు. బఫర్ జోన్లో మాత్రమే కాదని, ఏకంగా చెరువుల్లోనే నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేస్తున్నామని తెలిపారు. హైడ్రా చేసే ప్రతి పనికీ నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. హైడ్రా ఏర్పాటును ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు.