HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): ఒకవైపు మార్కింగులపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంటే.. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాలపై హైడ్రా కత్తులు నూరుతున్నది. బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో శుక్రవారం ఇంజినీరింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు నేషనల్ఏజెన్సీల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంతర్గతంగా అత్యవసరంగా సమావేశమయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాలలో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. శని, ఆదివారాల్లో 14టీమ్లతో కూల్చివేతలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కూల్చివేతలకు కొన్ని కీలక అంశాలు సమావేశంలో చర్చించినట్టు తెలిసింది.
మూసీ రివర్బెడ్లోని పలు కాలనీల్లో సర్వే మార్కింగ్ వెంటవెంటనే చేసి ఆ తర్వాత వనస్థలిపురంలో కొందరిని డబుల్బెడ్రూం ఇళ్లలోకి తరలింపు వంటివి తూతూమంత్రంగా చేపట్టారు. శనిఆదివారాల్లో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా పూర్తి పకడ్బందీ ప్రణాళికతో భారీ పోలీసు బందోబస్తుతో కూల్చివేతలకు బుల్డోజర్లు సిద్ధం చేశారు. శుక్రవారం మధ్యాహ్నమే టీమ్స్ అన్నింటినీ సిద్ధం చేసి కూల్చివేసే ఏరియాలు మాత్రం అర్ధరాత్రి వారి పర్సనల్ వాట్సప్ గ్రూప్లో పంపిస్తామని చెప్పినట్టు తెలిసింది. సమావేశంలో ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి చర్చించినా.. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల వద్ద ఉన్న మ్యాప్ల్లో చాలా తేడాలుండడం సమస్యలు తెచ్చిపెడుతుందని కమిషనర్ అన్నట్టు తెలిసింది.