HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోయి.. ఆదాయం పడిపోయింది. జూలైతో పోల్చితే ఆగస్టులో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఆదాయం రూ.412 కోట్లు తగ్గింది. ఇక రాష్ర్టానికి గుండెకాయలాంటి రాజధాని ప్రాంతంలో భూములు, ఇండ్ల కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి ఏకంగా 330 కోట్ల రాబడి తగ్గింది. అంటే రాష్ట్రవ్యాప్త నష్టంలో 80 శాతం ఇక్కడే నమోదైంది. దీంతో రియల్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
31 శాతం పడిపోయిన ఆదాయం
జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా 1,33,408 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యా యి. దీంతో ఖజానాకు రూ.1318.81 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి రూ.509 కోట్ల రాబడి నమోదైంది. కానీ ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య, రాబడి గణనీయంగా పడిపోయింది. గత నెలలో కేవలం 89,585 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, రూ.906.57 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. 43,823 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. జూలైతో పోల్చితే 32 శాతం పడిపోయాయి. ఆదాయం రూ.412.24 కోట్లు అంటే.. జూలైతో పోల్చితే 31 శాతం తగ్గిపోయినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
‘గ్రేటర్’లో స్పష్టంగా హైడ్రా భయం
రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి రాష్ట్రంలో 12 ‘రెవెన్యూ’ జిల్లాలు ఉన్నా యి. ఇందులో హైదరాబాద్, బంజారాహిల్స్, రంగారెడ్డి, మేడ్చల్, పటాన్చెరును ‘గ్రేటర్’ జిల్లాలుగా పేర్కొంటారు. హైదరాబాద్‌లోపాటు శివారు జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాలే రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన ఆదాయ వనరు. ఈ జిల్లాల నుంచే 80 శాతం ఆదాయం వస్తుంటుంది. హైడ్రా ధాటికి ఈ గ్రేటర్ రెవెన్యూ జిల్లాలు విలవిలలాడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఐదు జిల్లాల్లో కలిపి జూలైలో 65,668 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా.. రూ.1102 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే.. రాష్ట్రం ఆదాయంలో 83 శాతం ఈ ఐదు జిల్లాల్లోనే వచ్చింది. అయితే.. ఆగస్టు నాటికి ఈ జిల్లా ల్లో రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా పడిపోయాయి. గత నెలలో ఐదు జిల్లాల్లో కలిపి 45,943 రిజిస్ట్రేషన్లు కాగా, ఆదా యం రూ.772 కోట్లే వచ్చినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంటే.. రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 20 వేలు పడిపోగా.. రూ.330 కోట్ల రాబడి తగ్గింది. హైడ్రా కారణంగానే ఈ తగ్గుదల నమోదైనట్టు రియల్టర్లు చెప్తు న్నారు. ఏ ప్లాట్ కొనాలన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా? బఫర్ జోన్ కిందికి వస్తుం దా? అంటూ ఒకటికి వందసార్లు పరిశీలిస్తున్నారని తెలిసింది.