HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరానికి హైడ్రా ఫీవర్ పట్టుకుంది. మూడు పూలు ఆరు కాయలుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినికి హైడ్రా ప్రాణ సంకటంగా మారింది. చెరువుల సంరక్షణ పేరిట ఓ వైపు కాంగ్రెస్ సర్కార్ పేదల ఇండ్లపైకి బల్టోజర్లను నడుపుతుండగా.. మరోవైపు రాష్ట్ర ఖజానాను నింపే రెవెన్యూ చక్రం నిలిచిపోయింది. దీంతో మూడు నెలల వ్యవధిలో దాదాపు రూ.800 కోట్ల నష్టం వాటిల్లింది. రియల్ ఎస్టేట్‌కు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ తన బ్రాండ్ ఇమేజ్ను కూడా కోల్పోయింది. భూములు, స్థిర, చర ఆస్తుల క్రయవిక్రయాల సంఖ్య తగ్గుముఖం పట్టింది.
ఏడాదిన్నరకాలంగా కుదేలైన రియల్ ఎస్టే మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం మరింత నిర్వీర్యం చేసింది. హైడ్రా ప్రవేశంతో అంతంత మాత్రంగా సాగుతున్న ఇండ్ల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రభావంపై పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు తమ అధ్యయనాలను వెల్లడించాయి. ఆ నివేదికల ప్రకారం హైడ్రా పరిధియైన ఔటర్ రింగురోడ్డు లోపల గత మూడు నెలల కాలంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఫ్లాట్లు, ఇండిపెండెంట్ల రిజిస్ట్రేషన్లు 23 శాతం తగ్గినట్టు వెల్లడించాయి.
మూడు నెలల్లో రూ.800కోట్ల నష్టం
హైడ్రా పరిధి విస్తరించి ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అప్రకటిత కూల్చివేతలు, నిర్మాణాల తొలగింపుతో కొనుగోలుదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ కారణంగా ఈ నాలుగు జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.800 కోట్లు కోల్పోయినట్టు అధ్యయన నివేదికలు పేర్కొన్నాయి. నిరుడు సెప్టెంబర్ నెలల్లో ఈ నాలుగు జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1150 కోట్ల ఆదాయం సమకూరితే.. ఈ సెప్టెంబర్‌లో రూ.900 కోట్ల రెవెన్యూ కూడా రాలేదు.
రియాల్టీ స్లో డౌన్…
హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. కొనుగోలుదారులు స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎప్పుడో కొనుగోలు చేసిన భూముల్లో ప్రాజెక్టులు చేపడదామంటే.. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పేరిట హైడ్రా వచ్చి ఎప్పుడు కూల్చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ కారణంగానే కొత్త ప్రాజెక్టులను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడంలేదని పలు నిర్మాణ సంస్థలు వాపోతున్నాయి. బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులను మార్కెట్లో తీసుకురావడం కంటే, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తిచేయాలని, అదేవిధంగా పేరుకుపోయిన ఇన్వెంటరీని తగ్గించుకునేందుకు కష్టపడుతున్నారు.