హైదరాబాద్ సిటీబ్యూరో/పటాన్చెరువు, జనవరి 28(నమస్తే తెలంగాణ)/పటాన్చెరు/ అమీన్పూర్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అమీన్పూర్ పద్మావతి లేఅవుట్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మరికొందరు కలిసి వేసిన ఫెన్సింగ్‌ను మంగళవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఫెన్సింగ్‌ను కూలగొట్టారు. సర్వే నంబర్ 193,194, 323లోని 24 ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహరీని గతంలోనే హైడ్రా కూల్చేయగా.. తిరిగి అదే స్థానంలో ఫెన్సింగ్ ఏర్పాటుచేసి తమ ప్లాట్లకు చేరుకోవడానికి వీలులేకుండా చేస్తున్నారంటూ పద్మావతీనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు హైడ్రాకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ప్రహరీతో పాటు ఫెన్సింగ్‌ను తొలగించారు. ఈ ఆక్రమణలపై ఐలాపూర్ రాజగోపాల్‌నగర్ వాసులు, బందంకొమ్ము ప్రాంతం ప్రజలు ఫిర్యాదులు చేశారు.
సిస్ల లోహిత్‌ను ప్రోత్సహించొద్దు
24 ఎకరాల్లో వేసిన లేఔట్లో 293 ప్లాట్లు చేశారని ప్లాట్ల యజమానులు మీడియా ఎదుట తెలిపారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సిస్ల లోహిత్ తమ ప్లాట్లను కబ్జా చేసి తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సిస్ల లోహిత్ ఆంధ్ర సీఎం చంద్రబాబు వెంట ఉంటాడని, ఆంధ్రావారి ప్లాట్లు కబ్జా చేస్తున్న లోహిత్‌ను బాబు ప్రోత్సహించొద్దని బాధితులు కోరారు.
స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులు
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు.