తుర్కయాంజాల్, ఫిబ్రవరి 9 : ప్లాట్లను కబ్జా చేసి నిర్మించిన ఫామ్‌హౌస్‌ను హైడ్రా కూల్చివేసింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో ప్లాట్లను కబ్జా చేసి ఓ రియల్టర్ నిర్మించిన ఫామ్‌హౌస్‌ను అధికారులు ఆదివారం కూల్చివేయించారు. కొహెడ రెవెన్యూ సర్వే నంబర్ 951, 952లో ఏడు ఎకరాల 28గుంటల స్థలంలో 1986లో భూ యజమానులు కే రాములు, పెద్దయ్య, ఈ సయ్య లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. 2013లో సంరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ప్లాట్ల స్థలాన్ని అగ్రికల్చర్ భూమిగా మార్చి సుమా రు 80ప్లాట్లతోపాటు అంతర్గత రోడ్లనూ కబ్జా చేసి ఫామ్‌హౌస్ నిర్మించాడు. దీంతో ప్లాట్ల యజమానులు కోర్టును ఆశ్రయించారు.
కోర్టులో విచారణ కొనసాగుతుండగానే ఈ నెల 3న ప్లాట్ల యజమానులు, రాధేధామం లేఅవుట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ‘హైడ్రా’ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ రంగనాథ్ ఈ నెల 8న ఇరుపక్షాల సమక్షంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి భూమి పత్రాలను పరిశీలించారు. చివరికి ఆ భూమి ప్లాట్ల యజమానులకే చెందుతుందని ధ్రువీకరించారు. తుక్కుగూడ మున్సిపల్ అధికారులు సైతం ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్‌కు అనుమతుల్లేవని నిర్ధారించడంతో కూల్చివేతలు చేపట్టింది.