Hyderabad | ప్రియుడు తన మొబైల్‌కు రీచార్జ్ చేయించలేదని ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్లో నివాసం ఉంటున్న కిర్మణయి 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడు కిరణ్మయి తల్లి వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉంటే నాలుగేళ్ల క్రితం కిరణ్మయి కూకట్‌పల్లిలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకుంది. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది.
ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కిరణ్మయికి వెంకటేశ్ అలియాస్ చందూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త చనువుగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేసే స్థాయికి వచ్చేశారు. ఇద్దరూ ఏడాది నుంచి ప్రశాంత్ నగర్లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమె ఫోన్ రీచార్జ్ అయిపోయింది. ఆమెకు ఇంకా జీతం రాకపోవడంతో రీచార్జ్ చేసుకోలేకపోయింది. దీంతో వెంకటేశ్‌ను అడిగినప్పటికీ రీచార్జ్ చేయించలేదు. ఇదే విషయమై శుక్రవారం నాడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపం చెందిన కిరణ్మయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.