Government Land | బంజారాహిల్స్, డిసెంబర్ 23 : బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ స్థలం కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ వరుసగా ప్రచురిస్తున్న కథనాలతో ఎట్టకేలకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు స్పందించారు. మరోవైపు పలువురు రియల్టర్లు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ స్థలం గురించి ఆరా తీయడం ప్రారంభించారు. ఇంకోవైపు ఈ స్థలం కబ్జాకు అండదండలనిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు డోలాయమానంలో పడినట్టు తెలుస్తున్నది. ఇంటెలిజెన్స్ వర్గాలనుంచి సమాచారం సేకరించిన ప్రభుత్వ పెద్దలు విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తుండటంతో తగుచర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ప్రైవేటు వ్యక్తులతో జలమండలి, రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కయ్యారంటూ వారిమీద నెపం మోపేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా మరోసారి సోమవారం ఉదయాన్నే స్థానిక రెవెన్యూ సిబ్బంది ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటుచేసుకున్న రేకుల గేటు మీద కూడా ప్రభుత్వం స్థలం అని పేర్కొంటూ ఎరుపురంగు మార్కర్‌తో రాశారు. గతంలో రెండుసార్లు రెవెన్యూ సిబ్బంది ఏర్పాటుచేసిన బోర్డులను సదరు ప్రైవేటు వ్యక్తులు తొలగించడంపై తహసీల్దార్ అనితారెడ్డి సైతం సీరియస్ అయినట్టు తెలిసింది.
బంజారాహిల్స్ రోడ్ నం.10 ప్రధాన రహదారిపై సుమారు ఐదెకరాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్న విషయంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. పార్థసారథి అనే వ్యక్తి ఫోర్జరీ పత్రాలను సృష్టించి సర్వే నంబర్ 403/52లో తనకు ఐదు ఎకరాల స్థలం ఉన్నట్టు నమ్మిస్తున్నాడు. ప్రభుత్వ పెద్దల సహకారంతో తాత్కాలికంగా అయినా తానే పొజిషన్లో ఉన్నట్టు చూపించి నిర్మాణసంస్థ పేరుతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403/పీలో టీఎస్నెం 1/పార్ట్ బ్లాక్-హెచ్, వార్డు 10లో ఉన్న ప్రభుత్వ స్థలం తమ ఆధీనంలోనే ఉందని సూచిస్తూ.. సోమవారం ఉదయం సైతం బోర్డులు ఏర్పాటు చేసి ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రేకుల ఫెన్సింగ్ లోపల నిర్మాణాలు కొనసాగుతున్నట్టు తెలిసింది.
ఇదిలా ఉండగా, సదరు కబ్జాకు గురవుతున్న స్థలం బయట రెవెన్యూ సిబ్బంది ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టినా.. లోపల మాత్రం ప్రైవేటు వ్యక్తుల పహారా కొనసాగుతున్నది. సోమవారం ఉదయం ఆ ప్రభుత్వ స్థలం వద్దకు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి వెళ్లగా క్షణాల్లో ముగ్గురు యువకులు చుట్టుముట్టారు. ‘ఎవరు మీరు.. ఎందుకు ఇక్కడకు వచ్చారు.. ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఎందుకు ఫొటోలు తీస్తున్నారు?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. ‘ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డు ఉంది కదా.. మీరెవరు?’ అని ప్రశ్నించగా.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించారు. ఇంతలో ఓ వ్యక్తి గేటులోంచి తల బయటకు పెట్టి.. తమ బాస్ చెప్పేంతవరకూ ఇక్కడికి ఎవరూ రావద్దని, లోపలకు వెళ్తే ఇబ్బంది పడతారని చెప్పా రు. లోపల ఉన్న వేటకుక్కలు ఎవరివి అని ప్రశ్నించగా తమకు తెలియదని, తాము కేవలం డ్యూటీ కోసం ఇక్కడకు వచ్చామని అన్నారు. పక్కనున్న జలమండలికి చెందిన స్థలంలో కొంతమంది దర్జాగా కూర్చుని భోజనాలు తయారు చేస్తుండటం కనిపించింది. రెవెన్యూ సిబ్బంది బయట బోర్డులు పెట్టినా.. రేకుల ఫెన్సింగ్ లోపల మాత్రం నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలిసింది. రెవెన్యూ సిబ్బందిగానీ, జలమండలి అధికారులు కానీ లోనికి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ప్రభు త్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు కర్రలు, రాడ్లతో గస్తీ కాస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని బయటకు పంపించాల్సిన అధికారులు ఇప్పటిదాకా ఆ పనిచేయకపోవడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రం లో చీమ చిటుక్కుమన్నా ముందుగా తెలిసేది బంజారాహిల్స్‌లో ఇదే ప్రాంతంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు. ఈ భవనంలో నుంచి ఏ కిటికీ అద్దం తీసి చూసినా తమ పక్కనే కబ్జాకు గురైన స్థలంలో కర్రలు, రాడ్లతో తిరిగే వ్యక్తులు, వేటకుక్కలు కనిపిస్తాయి. అయినప్పటికీ పోలీసులు సైతం జో క్యం చేసుకోకపోవడం విస్మయం కలిగిస్తున్నది.
స్థలాన్ని కబ్జా చేశారని భావిస్తున్న పార్థసారథి చాలా ఏండ్ల క్రితమే ఇక్కడ ఓ గదిని నిర్మించడంతోపాటు ఏకంగా విద్యుత్తు మీటర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అతడు నిర్మించిన గదిని రెవెన్యూ అధికారులు కొంతమేర కూల్చేశారు. మొండిగోడలతో ఉన్న గదిని ఇటీవల తిరిగి నిర్మించుకున్న పార్థసారథి అక్కడ తన స్థలం అంటూ బోర్డులు రాసుకున్నాడు. ఆక్రమించుకున్న స్థలంలో కొండరాళ్ల మీద తన పేరుతో స్థలం ఉన్నట్టు నమ్మించేందుకు సర్వే నెం 403/52 అంటూ పలుచోట్ల రాశాడు. వీటిని చూపిస్తూ బిల్డర్లను నమ్మిస్తున్నాడని, దీనికి రెవెన్యూ, జలమండలి సిబ్బంది సహకరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగురోజుల క్రితం ఉన్నతాధికారులు కూడా ఇక్కడకు వచ్చి గదులను ,బోర్డులను తొలగించాలని చెప్పినా ఇప్పటిదాకా వాటిజోలికి పోలేదు.