హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (బ్లాక్‌స్పాట్) జరుగుతున్నట్టు గుర్తించారు. ఆయాచోట్ల ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టబోతున్నారు. ఈ హైవేపై సహజంగానే ట్రాఫిక్ రద్దీ అధికం. ఈ రహదారిపై గ్రామాలు, మూలమలుపులు, క్రాసింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా 17 ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్టు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ ఇంప్రూవ్మెంట్లు తదితర చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
రోడ్డు ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర పోలీసుశాఖ నమోదుచేసిన వివరాలను జాతీయ రహదారులశాఖ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ రిసెర్చ్ వింగ్ (టీఆర్‌డబ్ల్యూ) పరిశీలించి బ్లాక్స్పాట్లను ఖరారు చేస్తుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ప్రకారం, 500 మీటర్లలో వరుసగా మూడేండ్లలో ఐదు రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు, తీవ్ర గాయాలు సంభవించడం, లేక ఒకేసారి జరిగిన ప్రమాదంలో 10 మరణాలు సంభవించడం.. ఈ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ఇటువంటి బ్లాక్స్పాట్లు హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 ఉన్నాయి. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలతో కూడిన నివేదికను జాతీయ రహదారులశాఖ రూపొందించింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.