హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంతో సమానంగా పొరుగు రాష్ర్టాలకు చెందిన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పనిచేయడం కలకలం రేపుతున్నది. పరిపాలనకు కీలక కేంద్రమైన సచివాల యం, సీఎం నివాస పరిసరా లు, ఎంసీఆర్హెచ్ఆర్డీ, మం త్రులు, ఎమ్మెల్యేల నివాస సముదాయం మీద పొరుగు రాష్ర్టాల ఏజెన్సీలు నిఘా పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రతిపక్ష నేతల ఇండ్లు, ఫోన్లను టార్గెట్‌గా చేసుకొని పనిచేస్తుంటే, పొరుగున ఉన్న కర్ణాటక, ఏపీ నిఘా విభాగపు అధికారులు తెలంగాణలో తిష్ఠ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ముఖ్యనేతతో పాటు అధికార పార్టీ ముఖ్యుల రోజువారీ కార్యకలాపాల వివరాలను సేకరించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు సమాచారం.
కర్ణాటక నుంచి ఈ సమాచారం ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలకు వెళ్తున్నట్టు తెలిసింది. ఏపీ నిఘా వర్గాలు సమాచారాన్ని అమరావతికి పంపితే, అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు చేరిపోతున్నదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా కీలకమైన అంశాల్లో ముఖ్యనేతకు సంబంధించిన వివరాలు సరిహద్దు దాటి వెళ్తున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేషీల్లో ఎవరెవరు, ఎవరిరి కలుస్తున్నారు? నేతలు ఎవరు, దూతలు ఎవరు? ఏం మాట్లాడుకున్నారు, అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు సమాచారం.
రాష్ట్రంలో ముఖ్యనేతకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తీవ్ర గ్యాప్ పెరిగిందని, ఆయన ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా, అధినాయకుడి అపాయింట్మెంట్ దొరకడంలేదని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. మరోవైపు బీజేపీ నేతలు ఆయనకు సన్నిహితంగా మెదలటం, కోరిన వెంటనే కేంద్ర మంత్రులు సమయం ఇవ్వటంపై ఢిల్లీ అధిష్ఠానం అనుమానపడుతున్నట్టు తెలిసింది. మూసీ నది ప్రక్షాళన, పరీవాహక ప్రాంత సుందరీకరణంలో భాగంగా హిమాయత్‌సాగర్ వద్ద ఉన్న బాపూఘాట్‌ను తెర మీదకు తేవడంతో అనుమానం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ జ్ఞాపకాలను మాత్రమే కాంగ్రెస్ నేతలు తమ సిద్ధాంతాలుగా పరిగణిస్తున్నారు. వారిని కాదని బాపూ సరోవర్కు ప్రాధన్యం ఇవ్వడంలో ఎవరి పాత్రో ఉన్నట్టు అనుమానపడుతున్నారని సమాచారం.
కాంగ్రెస్ నేతగా గుర్తింపు ఉన్న సర్దార్ పటేల్ విగ్రహాన్ని బీజేపీ వ్యూహాత్మకంగా నర్మదా నదీ తీరంలో కట్టి, ఆయనను తమ ఖాతాలో వేసుకోసుకోగలిగిందని, ఇప్పుడు హైదరాబాద్‌లో అదే ప్రయోగం జరుగుతున్నట్టు జాతీయ కాంగ్రెస్ సందేహపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బాపూఘట్ను తెరమీదికి తేవడం వెనుక గుట్టుమట్లను తెలుసుకునేందుకు కర్ణాటక ఇంటెలిజెన్స్ విభాగ అధికారులు హైదరాబాద్‌కు వచ్చినట్టు సమాచారం.
ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు అమరావతిలో కన్నా హైదరాబాద్‌లోనే ఎక్కువగా తిరుగుతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఏపీ రాజకీయాల్లో అత్యధిక శాతం హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నట్టు సమాచారం. పనిలో పనిగా ఇక్కడి ప్రభుత్వానికి వ్యతిరేక కార్య్యకలాపాలు ఏమైనా జరిగితే ఆంధ్ర నిఘా వర్గాలే సూచనలు చేస్తూ ప్రభుత్వ పెద్దలను అప్రమత్తం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పొరుగు రాష్ట్రం సీఎం, డిప్యూటీ సీఎంకు హైదరాబాద్‌లో అనువైన వాతావరణం కల్పించటంతోపాటు, ఇక్కడి రోజువారీ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు అక్కడి ముఖ్యనేతలకు అప్డేట్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక్కడి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? ఏ ఎమ్మెల్యే ఎవరితో టచ్‌లోకి వెళ్తున్నారు? ముఖ్యనేతకు ఏమైనా రాజకీయ ప్రమాదం ఉన్నదా?బనకచర్లకు ఎవరు అనుకూలంగా ఉన్నారు? ఎవరు వ్యతిరేకిస్తున్నారు? తదితర అంశాల మీద దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతున్నది. రాష్ర్టానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలకు సబంధించిన వివరాలు, మంత్రుల పర్యటనలు, పరిపాలనా పరమైన నిర్ణయాలు ఎప్పటికప్పుడు పొరుగు రాష్ర్టానికి చేరిపోతున్నాయని అంటున్నారు.
ఈ సమాచారం అమరావతి మీదుగా కేంద్రానికి వెళ్తున్నట్టు తెలిసింది. ఏపీలోని మద్యం కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌజ్‌లో దాచిపెట్టిన డబ్బు ఏపీ నిఘా విభాగాలు అతి సునాయాసంగా గుర్తించినట్టు చెప్పుకుంటున్నారు. పొరుగు రాష్ర్టాల ఇంటెలిజెన్స్ విభాగాలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తెలిసినా, చూసీ చూడనట్టు వదిలేస్తున్నారని సమాచారం.