హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థి సత్తాచాటాడు. నగరానికి చెందిన తేజాస్ ముందడా 492 మార్కులతో ఆలిండియా రెండో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. తేజాస్ 82 పర్సంటైల్ సొంతం చేసుకోవడం గమనార్హం. సీఏ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ధమ్నోడ్ పట్టణానికి చెందిన ముకుంద్ అగివాల్ 500మార్కులతో మొదటి ర్యాంకు, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన బకుల్ గుప్తా 489 మార్కులతో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు.
సీఏ ఫైనల్లో గ్రూప్ -1లో 24.66%, గ్రూప్ -2లో 25.26%, రెండు గ్రూపుల పరీక్షలు రాసిన వారిలో 16.23% ఉత్తీర్ణత నమోదయ్యింది. సీఏ ఇంటర్మీడియట్లో గ్రూప్ -1లో 9.43%, గ్రూప్ -2లో 27.14%, రెండు గ్రూపులకు పరీక్షలు రాసిన వారిలో 10.06% చొప్పున ఉత్తీర్ణులయ్యారు. సీఏ ఫౌండేషన్ కోర్సులో మొత్తంగా 98,827 మంది పరీక్ష రాస్తే 14,609 మంది(14.78%) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిలు 15.74%, అమ్మాయిలు 13.78% చొప్పున ఉత్తీర్ణత సాధించారు.