అమెరికా: హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఆర్యన్ రెడ్డి(23) అమెరికా జార్జియాలోని అట్లాంటాలో ప్రమాదవశాత్తు సొంత తుపాకీ పేలి మృతి చెందాడు. ఈ నెల 13న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ రెండో ఏడాది చదువుతున్న ఆర్యన్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో కలసి పార్టీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఆర్యన్ గదికి వెళ్లాడు. కాసేపటికి గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో మిత్రులంతా వెళ్లి చూడగా రక్తపుమడుగులో ఆర్యన్ కుప్పకూలి ఉన్నాడు. సమీపంలోని దవాఖానకు తరలించగా అతడు మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి
నారాయణపేట రూరల్, నవంబర్ 22 : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. అభంగాపూర్‌కు చెందిన రైతు మేకం భీమప్ప (33) తనకున్న రెండెకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. శుక్రవారం పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ(ఎంఎల్-మాస్‌లైన్) డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.