హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల పాపకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. అది కూడా అత్యవసరమని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అని.. వెంటనే లండన్ తీసుకెళ్లాలని చెప్పారు. పాప తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. పాస్‌పోర్టు అంటేనే రోజుల తరబడి పని. దరఖాస్తులు, ఎంక్వయిరీలు.. ఇలా ఎంతో ప్రాసెస్!.. తల్లిదండ్రులు.. హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్(ఐఆర్ఎస్) దాసరి బాలయ్యని సంప్రదించారు. పరిస్థితిని వివరించారు. తత్కాల్ సేవల కింద పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేశామని, అత్యవసరంగా పాస్‌పోర్టు జారీ చేయాలని విన్నవించారు. ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. కేవలం.. గంటలోనే పాస్‌పోర్టును తల్లిదండ్రులకు అందజేశారు. పాస్‌పోర్టు కేంద్రం పనితీరుపై పలువురు ప్రశంసలు కురిపించారు. బాలయ్య మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఎమర్జెన్సీ అనుకొం టే, నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు.