హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): 2024-25 సంవత్సరానికిగాను ‘వినూత్న సంస్కరణలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాలు’ అనే క్యాటగిరీ కింద హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి పురస్కారం లభించింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న 13వ పాస్‌పోర్ట్ సేవాదివస్లో భాగంగా మంగళవారం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఆపరేషనల్ ఎఫిషియెన్సీని కొనసాగిస్తూ దరఖాస్తుల పెండెన్సీని తగ్గించడం, అపాయింట్మెంట్ సమయాన్ని మెరుగుపర్చడం, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా చూడడం, ఈ-పాస్‌పోర్ట్ విధానాన్ని అమలుచేయడం తదితర సంస్కరణలను విజయవంతంగా అమలుచేస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. అలాగే, దరఖాస్తులు త్వరితగతిన పరిశీలించి పాస్‌పోర్టులను వేగంగా అందించడంలో నిరంతరం రాణిస్తున్న రాష్ట్ర పోలీసులను ఈ సందర్భంగా సన్మానించారు. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బత్తుల శివధర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు.