బుధవారం 03 జూన్ 2020
Telangana - May 15, 2020 , 01:46:01

హైదరాబాద్‌లో చిరుతపులి

హైదరాబాద్‌లో చిరుతపులి

  • కాటేదాన్‌ సమీపంలో రోడ్డుపై సంచారం    
  • సమీపంగా వెళ్లిన లారీడ్రైవర్‌పై దాడి
  • బంధించేందుకు అటవీ అధికారుల యత్నం
  • మత్తుమందు ఇచ్చేలోపే పొదల్లోకి అదృశ్యం

హైదరాబాద్‌/ గోల్కొండ, బండ్లగూడ/నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ నగరంలో చిరుతపులి సంచారం గురువారం కలకలం సృష్టించింది. కాటేదాన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రైల్వే అండర్‌పాస్‌ వద్ద ఉదయం 6 గంటల సమయంలో కనిపించిన చిరుతను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సుభాన్‌ అనే ఓ లారీడ్రైవర్‌ చిరుత సమీపానికి వెళ్లటంతో అతనిపై దాడిచేసి గాయపర్చింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా తప్పించుకొని సమీపంలోకి చెట్లపొదల్లోకి వెళ్లిపోయింది. సాయంత్రం వరకు ప్రయత్నించినా అది పట్టుబడలేదు. 

నీటికోసమే వచ్చిందా?

గగన్‌పహాడ్‌, శంషాబాద్‌ కోత్వాల్‌గూడ ప్రాంతంలో విస్తరించిన గుట్టల నుంచి ఈ చిరుత రోడ్డుపైకి వచ్చినట్టు భావిస్తున్నారు. వేసవి కారణంగా అటవీప్రాంతంలో నీరు లభించకపోవటంతో దాహం తీర్చుకొనేందుకు జనవాసాల్లోకి ప్రవేశించి ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఐదారేండ్ల వయసున్న ఈ చిరుతు నీరు దొరకక బాగా నీరసించింది. అండర్‌పాస్‌ బ్రిడ్జి రెయిలింగ్‌పై కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వీధికుక్కలు మొరగడంతో సమీపంలోని నిర్జన ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అటవీ అధికారులు మత్తుమందు ఇవ్వటానికి ప్రయత్నించేలోపే కనిపించకుండాపోయింది. ఆ ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో చిట్టడవిలాగా ఉండటంతో డ్రోన్‌ కెమెరాలతో గాలించినా చిరుతను గుర్తించటం సాధ్యంకాలేదు. రెండు బోనులు ఏర్పాటు చేసి మేకలను ఎరవేసినా పట్టుబడలేదు. అయితే, చిరుతను వీలైనంత త్వరగా బంధిస్తామని అధికారులు తెలిపారు. 


గోల్కొండలో మానుపిల్లి

గోల్కొండ ఫతే దర్వాజా సమీపంలో నల్లచిరుతను పోలిన జంతువు కనిపించటం కలకలం రేపింది. గురువారం ఉదయం స్థానిక నూరానీ మసీదులోకి ప్రవేశించిన ఆ జంతువు ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు నెహ్రూ జూపార్కు అధికారుల సాయంతో మత్తుమందు ఇచ్చి దానిని బంధించారు. ఆ జంతువు నల్లచిరుత కాదని మానుపిల్లి అని తేల్చటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. logo