హైదరాబాద్ సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ ): పాస్‌పోర్ట్ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ శుక్రవారం తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే గంటలోపే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలను గందరగోళపరిచే వార్తలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆమె స్పందించారు. ఎప్పటిలాగానే అవసరమైన స్లాట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
కస్లమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులనూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని వివరించారు. పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు స్లాట్స్ బుక్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరం చేశామని పేర్కొన్నారు. www. passportindia. gov.inలో పాస్‌పోర్ట్ సేవలు పొందవచ్చని తెలిపారు. కొంతమంది స్లాట్స్ బుక్ చేసుకోకుండానే కార్యాలయాలకు వెళ్తున్నారని, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని ఆమె సూచించారు. ఏజెన్సీల మోసాలపై 1800113090 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి, +91-7428321144 కు వాట్సాప్‌లో మెసేజ్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని పేర్కొన్నారు.