‘హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ రంగం పడిపోలేదు. చంద్రబాబు రాగానే ఏపీకి పెట్టుబడులు పోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం. హైదరాబాద్-బెంగళూరు కేంద్రంగానే పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతికి తరుచుగా వచ్చే వరదలతో పెట్టుబడిదారులు జంకుతున్నారు’ ఇవీ ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కానీ, వాస్తవిక పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ) : ‘ఏడాది కాలంగా రియల్ఎస్టేట్ అమ్మకాలు లేవు.. ఉన్న ప్రాజెక్టులకు పెట్టుబడులు రావు.. హైడ్రా కారణంగా సామాన్యుడికి సొంతింటి కల భయానకంగా మారింది..’ ఇవేవో ఒకరిద్దరూ చెప్తున్న మాటలు కాదు. తాజాగా వెల్లడవుతున్న రియల్ఎస్టేట్ రంగం అధ్యయనాలు, క్షేత్రస్థాయి రియల్ఎస్టేట్ ఏజెంట్లు, స్మాల్ అండ్ మీడియం డెవలపర్లు చెప్తున్న మాటలు. పెట్టిన పెట్టుబడికి మిత్తి కట్టలేని పరిస్థితులు దాపురించాయంటూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న నిజాలు. హైడ్రాతో హైదరాబాద్‌కు పెట్టుబడులు రావడం లేదంటూ కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు వాస్తవిక పరిస్థితికి అద్దంపడుతున్నాయి. హైడ్రా.. రియల్ఎస్టేట్ వ్యాపారులతో పాటు సామాన్యులను కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిందని, ఏడాది కాలంగా అవసరానికి ఒక్క ప్లాటు కూడా అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌కు రియల్ఎస్టేట్, ఐటీ రంగాల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగితే, గత ఏడాది కాలంగా పరిస్థితి తల్లకిందులైందని, రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాలు పడిపోయాయని వివిధ నివేదికలు ఘోషిస్తున్నాయి. రాష్ట్ర ఖజానాకు అత్యంత కీలకమైన హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగాన్ని పరిరక్షించుకునే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా, భయాందోళనలకు దారి తీసే విధానాలను ప్రభుత్వం కొనసాగిస్తే మార్కెట్ మరింత పడిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్‌లో రియల్ఎస్టేట్ మార్కెట్ డీలా పడిన తీరును వివిధ అధ్యయనాలు, సర్వేలు కండ్లకు కడుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో రెసిడెన్షియల్ క్రయ, విక్రయాలపై తాజాగా విడుదలైన అనరాక్ వార్షిక నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లో గృహ విక్రయాలకు బ్రేక్ పడింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ ఏడాది గృహ విక్రయాలు 5% మేర పడిపోయినట్టు అనరాక్ నివేదిక పేర్కొన్నది. ఈ ఏడాది కాలంగా హైదరాబాద్‌లో 58,540 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్టు వెల్లడించింది. కొత్త ప్రాజెక్టులు కూడా మార్కెట్లోకి రావడం లేదని తెలిపింది. ఇదిలాఉంటే, బయ్యర్స్ డిలైట్ రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ వెల్లడించిన త్రైమాసిక నివేదిక ప్రకారం.. అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి 47% అమ్మకాలు పడిపోయాయి. గత ఏడాది 24,044 యూనిట్లు విక్రయించగా, ఈసారి కేవలం 12,682 అమ్మకాలు జరిగినట్టు వివరించింది. అదే బెంగళూరులో 13% అమ్మకాలు మాత్రమే ప్రభావితమైనట్టు వెల్లడించింది. ఈ గణాంకాలన్నీ కాంగ్రెస్ పాలనలో రియల్ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న దుస్థితిని కండ్లకు కడుతున్నాయి.
కాంగ్రెస్ పాలనలో రియల్టీ మార్కెట్ కుప్పకూలిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా సాధారణ రియల్టర్లు, డెవలపర్లను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలుచేస్తున్న విధానాలు వ్యాపారానికి గొడ్డలిపెట్టుగా మారాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ పాలనలోనే రియల్ఎస్టేట్ మార్కెట్ అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు. పేదల నడ్డి విరిచే ఎల్ఆర్ఎస్ను ఎత్తివేస్తే ఎంతోమంది పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పొంగులేటికి ఎన్నోసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని చెప్తున్నారు.