ఖైరతాబాద్, అక్టోబర్ 26 : హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌లో 1,280 ఓట్లకు 1,093 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీగా నమస్తే తెలంగాణ సిటీబ్యూరో సీనియర్ రిపోర్టర్ వీ బాపురావు ఘనవిజయం సాధించారు.
అధ్యక్షుడిగా ఎస్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాజేశ్, అరుణ, ప్రధాన కార్యదర్శిగా వరికుప్పల రమేశ్, మరో జాయింట్ సెక్రటరీగా చిలుకూరి హరిప్రసాద్, ట్రెజరర్‌గా రమేశ్ వైట్ల, ఈసీ మెంబర్లుగా ఉమాదేవి, కల్యాణం రాజేశ్వరి, మర్యాద రమాదేవి, శంకర్ షిగా, శ్రీనివాస్‌రెడ్డి, కస్తూరి శ్రీనివాస్, వనం నాగరాజు, అశోక్ దయ్యాల ఎన్నికయ్యారు. మరో ఈసీ మెంబర్ పోస్టుకు పోటీపడ్డవారిలో అమిత్ భట్టు, ఎంవీవీ సత్యనారాయణకు సమానంగా ఓట్లు వచ్చాయి. మళ్లీ ఎన్నికలు నిర్వహించటమా, వీరిలో ఒకరిని విజేతగా ప్రకటించటమా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉన్నది.