Hyderabad Police | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనం ఫైనల్ డేకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సారి సోమవారం మిలాద్ ఉన్ నబీ, మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్ గార్డెన్లో, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవమంటూ పరేడ్ గ్రౌండ్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. దీంతో 48 గంటల పాటు హైదరాబాద్ పోలీసులు కంటిమీద కునుకులేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుంది. నిమజ్జనాన్ని ప్రశాంత వాతవారణంలో నిర్వహించడం పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. గత ఏడాది మిలాద్ ఉన్ నబీ, గణేశ్ నిమజ్జనం ఒకే రోజు వచ్చినా పోలీస్ వ్యవస్థ ముందుచూపుతో వ్యవహారించి రెండు పండుగలు ఒకే రోజు కాకుండా చర్యలు తీసుకున్నది. అయితే ఈ సారి కూడా అలాంటి పరిస్థితే ఉన్నా.. అదనంగా సెప్టెంబర్ 17 వచ్చింది. కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమాలకు కేంద్రమంత్రులు, బీజేపీ శ్రేణు లు హాజరవుతాయి. ప్రజాపాలనకు సీఎం హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో అన్ని కార్యక్రమాలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. నిమజ్జనాలు బుధవారం ఉదయం వరకు జరిగే అవకాశాలుంటాయి. దీంతో సోమవారం ఉదయం పోలీసుల పహా రా మొదలైతే.. బుధవారం ఉదయం వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
సిటీ పోలీసులు బందోబస్తులో ఫైనల్ ఫేజ్‌లోకి వచ్చేశారని, ఇక 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలంటూ డీసీపీ, ఎస్హెచ్లో, పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బందితో సీపీ సీవీ ఆనంద్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఆదివారం రాత్రి నుంచే మిలాద్ ఉన్ నబీ ప్రారంభమవుతుంది. 17న నిమజ్జనంతో పాటు పబ్లిక్ గార్డెన్స్, పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించటాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి. మిక్స్డ్ కమ్యూనిటీ ఉన్న ప్రాంతాలలో బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందిని పెంచాలి. ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్‌తో క్షేత్రస్థాయిలో జరిగే ఘటనలను తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. క్రిటికల్ జంక్షన్స్, క్రాస్‌రోడ్స్‌లో తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. బషీర్‌బాగ్ చౌరస్తా, ఎంజే మార్కెట్లో చాలా కీలకం. కమ్యూనికేషన్ సిస్టం బాగుండాలి. చెకింగ్స్, సోషల్‌మీడియా మానిటరింగ్, షీ టీమ్స్ పకడ్బంధీగా విధులు నిర్వర్తించాలి. డ్రోన్ కెమెరాలు, మౌంటెడ్ కెమెరాలు, కెమెరా మౌంటెడ్ వాహనాలను ఏర్పాటుచేస్తున్నాం’ అని వివరించారు. 19న జరిగే మిలాద్ ఉన్ నబీ ర్యాలీపైనా సీపీ సిబ్బందితో మాట్లాడారు. సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్‌సింగ్‌మాన్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.