హైదరాబాద్ : మనుషులకు, పక్షులకు, పర్యావరణానికి హాని కలిగిస్తున్న చైనా మాంజా ( Chinese manja ) పై హైదరాబాద్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్న రూ.1.24 కోట్ల విలువైన నిషేధిత చైనా మాంజాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ( VC Sajjanar ) గురువారం పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకునే సమయంలో కొందరు చర్యల వల్ల ప్రాణాలు హరిస్తున్నాయని అన్నారు. చైనా మాంజాపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కొందరు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారని, నగరంలో ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా, గోదాముల్లో నిల్వ చేసినా, అక్రమ రవాణాకు పాల్పడినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పోలీసులు చేపట్టిన తనిఖీల వల్ల వ్యాపారులు ఆన్లైన్ బాట పట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఈ-కామర్స్ వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికగా సాగే క్రయవిక్రయాలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. ప్లాస్టిక్, గాజు పెంకులు, మెటాలిక్ కోటింగ్ ఉండే ఈ మాంజా వల్ల పిల్లలకు విద్యుత్ షాక్ కొట్టే ప్రమాదం ఉందని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి సంప్రదాయ నూలు దారాలనే ప్రోత్సహించాలని కోరారు.
డయల్ 100కు ఫిర్యాదు చేయాలి..
ఎవరైనా మాంజా విక్రయిస్తే ‘డయల్ 100’ లేదా వాట్సాప్ నెంబర్ 94906 16555 కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నగరవ్యాప్తంగా అన్ని జోన్లలో నిర్వహించిన దాడులలో ఇప్పటివరకు మొత్తం 103 కేసులు నమోదు కాగా, 143 మంది నిందితులను అరెస్టు చేశామని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ సీపీ ఎం. శ్రీనివాసులు, డీసీపీలు కారె కిరణ్ ప్రభాకర్, జి. చంద్రమోహన్, , గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ రావు అధికారులు పాల్గొన్నారు.