హైదరాబాద్, డిసెంబర్17(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ముస్లింలు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తారు కానీ, ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కే ఓటు వేస్తారని, లేదంటే ఎంఐఎంకు ఓటు వేస్తారని సీనియర్ కాంగ్రెస్ నేత వీ హన్మంతరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అయినప్పటికీ, ముస్లింలు తమకు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వీహెచ్ వ్యాఖ్యలపై ఆగ్రహించిన మైనార్టీ నాయకులు అక్కడే ఆందోళనకు దిగారు.
సోమవారం సాయంత్రం గాంధీభవన్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. పార్టీ మీటింగ్‌కు కార్యకర్తలు రావాలిగానీ రూ.100, రూ.200 తీసుకొనే కూలీలు రావద్దని సెటైర్ వేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దమ్మున్న కాంగ్రెస్ లీడర్ ఒక్కరు కూడా లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావుకు కౌంటర్ ఇవ్వడం వీళ్లకు చేతకాదంటూ చిటపటలాడారు. అటు వీహెచ్, ఇటు దీపాదాస్ మున్షీ వ్యాఖ్యలతో సభలో గందరగోళం ఏర్పడింది.