హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని సీఎస్ కే రామకృష్ణారావు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులతో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మెట్రో రైల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియపై ఆయన సమీక్షించారు.
ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒ ప్పందం ప్రకారం బదలాయింపు ప్రక్రి య వేగవంతం చేయాలని, వచ్చే వంద రోజుల్లోపు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఈమేరకు నివేదికను త్వరగా పూర్తిచేసి సర్కారుకు అందజేయాలని సూచించారు. ఎల్ అండ్ టీ, మెట్రో సంస్థలు పరస్పర సహకారంతో ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆ తర్వాత ఆపరేషనల్, మెయింటెనెన్స్ ప్రతిపాదనలను రూపొందించాల్సిందిగా మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్‌ను సీఎస్ ఆదేశించారు.
హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతిఘటించాలని ప్రజలకు తెలంగాణ రైతు సంఘం పిలుపునిచ్చింది. కేంద్రం కొత్తగా ప్రతిపాదిస్తున్న వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లును-2025ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ కార్మికుల పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిందని చెప్పారు.
వ్యవసాయ పనులు లేనప్పుడు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు పథకం ఎంతగానో ఉపయోగపడుతున్నదని తెలిపారు. ధనవంతులు, భూస్వాములు ఉపాధి పథకానికి వ్యతిరేక వైఖరిని తీసుకున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని 11 ఏండ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ఉపాధి పథకానికి నిధుల కొరత నెలకొన్నదని మండిపడ్డారు. ఇప్పుడు గ్రామీణ కార్మికుల ఉపాధి అవకాశాలను తొలగిస్తున్నారని, ఫలితంగా వలసలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ దుష్టచర్యకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అన్నివర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.