హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుందామనుకున్న రుణం ఎక్కడికి పోయిందో తెలువదు. లోను కోసం దేవులాడినా.. ఐఆర్ఎఫ్సీ ఇవ్వబోమని తేల్చేసింది. మెట్రో ఆస్తుల విలువ లెక్కింపు కోసం ఐడీబీఐకి సర్కార్ కట్టిన కన్సల్టేషన్ ఫీజూ పోయింది. మళ్లీ కొత్తగా ఆస్తుల మదింపు బాధ్యతను ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాల్సి వచ్చింది. అంతా అయిపోయిందని అనుకున్న దశలో అరికాశుడనే పెద్దపాము మింగితే ఒకటో నంబర్ గడికి చేరినట్టు.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మళ్లీ మొదటికొచ్చింది. కానీ ప్రతిదాంట్లో ప్రభుత్వాన్ని మోయడమే పనిగా పెట్టుకున్న పలు ప్రధాన పత్రికలు, వందిమాగధ మీడియా మాత్రం అదేదో విజయమన్నట్టుగా, రేవంత్ ఢిల్లీ వెళ్లి.. దాన్ని సాధించుకుని వచ్చాడన్నట్టుగా కలరింగ్ ఇస్తూ కథనాలు అల్లింది. ఢిల్లీ చర్చల తర్వాత ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తితో వెనుదిరిగారు.
ముందుగా ప్రకటించిన మీడియా చిట్చాట్నూ రేవంత్ ఉన్నపళంగా రద్దు చేసుకుని మరీ హైదరాబాద్‌కు వచ్చేశారు. పైగా రాష్ట్రప్రభుత్వం కూడా మెట్రో విషయంలో పూర్తిగా ఆత్మరక్షణలో పడింది. పట్టుమని పదివాక్యాలు కూడాలేని ఓ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకొన్నది. సర్కారే దాన్ని ఘనతగా చెప్పుకోలేని స్థితిలో ఉంటే.. ప్రభుత్వ పల్లకి మోసే అక్షరబోయీలు మాత్రం ఆహా, ఓహో అంటూ అసత్య కథనాలు వండివార్చారు. పలు జాతీయ పత్రికలు మెట్రో కథ అడ్డంతిరిగిందని రాసుకొస్తే.. అదేదో అసాధారణ విజయం అన్నట్టుగా తెలుగు పత్రికలు అరపేజీ నిండా అక్షరాలతో ఆత్రంగా అలుక్కొచ్చాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఇతర ఆంధ్రాపత్రికలు, మీడియా చానళ్లు కాంగ్రెస్ సర్కార్‌కు వంతపాడటం కొత్తేమీకాకపోయినా.. తెలంగాణకు కీలక ఆస్తిగా ఉన్న మెట్రో విషయంలో ప్రజలకండ్లకు గంతలు కట్టడం క్షంతవ్యం కాదని సీనియర్ పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు.